గూగుల్ ను నమ్ముకుంటే.. పెళ్లి కూతురే మారిపోయిందే

ఆ మధ్యన వచ్చిన ఒక సినిమాలో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళితే.. ఏకంగా పర్వతం కొనకు వెళ్లటం.. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి.. బ్రేకులు వేసిన సీన్ ప్రేక్షకుల ముఖాన నవ్వులు పూయిస్తుంది. సినిమాల్లో ఓకే.. వాస్తవంలో అలాంటి పరిస్థితే వస్తే అన్న ఆలోచనకే వణుకుతాం. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు గూగులమ్మను నమ్ముకొని బతకటం ఇవాల్టి రోజుల్లో అలవాటుగా మారింది. కొత్త ప్లేస్ కు వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ ను పెట్టుకొని వెళ్లటం అంతకంతకూ అలవాటుగా మారింది.

తాజాగా అలా చేసిన ఒక పెళ్లి టీంకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ఇండోనేషియాలోని ఒక పెళ్లి కొడుకు బయలుదేరాడు. సెంట్రల్ జావాలోని లొసారి హామ్లెట్ లోని వధువు ఇంటికి వెళ్లాల్సిన వరుడు.. అతని బంధువులు గూగుల్ మ్యాప్ తో ప్రయాణం మొదలుపెట్టారు. తీరా వారు వెళ్లాల్సిన చోటుకు కాకుండా.. జెంగ్ కోల్ హామ్లెట్ అనే ఊరికి వెళ్లారు. అక్కడ కూడా ఒక పెళ్లి మండపం.. హడావుడిగా ఉండటంతో. . వెనుకా ముందు చూసుకోకుండా అందులోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడున్నవధువు మారియాకు ఎంగేజ్ మెంట్ జరుగుతోంది.

తనతో ఎంగేజ్ మెంట్ చేసుకోవటానికి రావాల్సిన వరుడు.. పెళ్లికొడుకు అవతారంలో రావటంతో అనుమానించింది. ఆ వెంటనే ఏదో తప్పు జరుగుతుందని గ్రహించి.. ఆ విషయాన్ని పెళ్లి కొడుకు వారికి చెప్పటంతో వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. తాము వెళ్లాల్సిన ప్లేస్ కాకుండా మరో చోటుకు వచ్చామని తెలుసుకొని నాలుక కర్చుకున్నారు. గూగులమ్మను నమ్ముకుంటే తమకీ దుస్థితి ఏర్పడిందని వాపోతూ.. పెళ్లి కుమార్తె గ్రామానికి బయలుదేరారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారింది.