హ‌రీష్ శంక‌ర్‌కు, బండ్ల గ‌ణేష్‌కు విభేదాలా?

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, నిర్మాత బండ్ల గ‌ణేష్‌ల్లో ఒక కామ‌న్ పాయింట్ ఉంది. ఇద్ద‌రూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమానులు. వాళ్లిద్ద‌రూ ఆ అభిమానాన్నంతా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా మేకింగ్‌లో చూపించారు. హ‌రీష్ త‌న అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను ఈ సినిమా కోసం వాడితే.. గ‌ణేష్ రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించారు.

ఇద్ద‌రూ క‌లిసి ప‌వ‌న్‌కు, ఆయ‌న అభిమానుల‌కు మ‌ర‌పురాని సినిమాను అందించారు. ఈ సినిమా విడుద‌లై ఎనిమిదేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో అభిమానులు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపారు. వారిని ఇటు హ‌రీష్‌, అటు బండ్ల గ‌ట్టిగానే ప్రోత్స‌హించారు. కానీ వీళ్లిద్ద‌రూ ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటూ ఒక‌రి గురించి ఒక‌రు ప్ర‌స్తావించ‌డానికి మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు.

ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి చూసిన ఎగ్జైట్మెంట్లో హ‌రీష్ శంక‌ర్ ఒక నోట్ లాంటిది రిలీజ్ చేశాడు సోమ‌వారం రాత్రి. నిన్న‌నే గుజ‌రాత్‌కు వెళ్లిన‌ట్లుంది.. మొన్నే క‌దా పొల్లాచ్చిలో పాట తీసిన‌ట్లుంది.. అప్పుడే ఎనిమిదేళ్లు అయిపోయిందా అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు హ‌రీష్ ఇందులో. ఈ సినిమా కోసం ఒక్కొక్క‌రు ఎలా క‌ష్ట‌ప‌డింది చెబుతూ టెక్నీషియ‌న్లు ప్ర‌తి ఒక్క‌రి గురించి ప్ర‌స్తావించాడు.

సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్, సినిమాటోగ్రాఫ‌ర్ జ‌య‌న‌న్ విన్సెంట్‌, స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌లు ర‌మేష్ రెడ్డి, స‌తీశ్ వేగేశ్న‌.. ఇలా అంద‌రినీ కొనియాడాడు. కానీ నిర్మాత బండ్ల గ‌ణేష్ పేరును మాత్రం విస్మ‌రించాడు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే బండ్ల పేరును ఇగ్నోర్ చేసిన‌ట్లు స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. హ‌రీష్ ఈ ట్వీట్ వేసిన కొన్ని నిమిషాల‌కే బండ్ల.. ‘‘మా గబ్బర్ సింగ్ ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచి అనుక్షణం నాకు అండగా ఉంటూ నాకు ఇంత ఘనవిజయాన్ని చేకూర్చడానికి ముఖ్య కారణమైన మిత్రులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ ఒక ట్వీట్ వేశాడు.

సినిమా తీసింది హ‌రీష్ అయితే.. అత‌డి పేరు చెప్ప‌కుండా త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్ప‌డం చూస్తే ఇది కౌంట‌ర్‌లా క‌నిపిస్తోంది. మొత్తానికి వీరి తీరు చూస్తే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో తేడా జ‌రిగిన‌ట్లే అనిపిస్తోంది.