కోదండ‌రాం స‌న్నిహితుల్లో కొత్త‌ డౌట్లు

కోదండ‌రాం స‌న్నిహితుల్లో కొత్త‌ డౌట్లు

తెలంగాణ జేఏసీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరిస్తుందా? లేక జేఏసీ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం మరో రాజకీయ పార్టీలోకి వెళ్ళనున్నారా? అలా వెళితే జేఏసీ భవిష్యత్తు ఏమవుతుంది? కొత్తగా ఎవరైనా బాధ్యత స్వీకరించి ముందుకు నడిపిస్తారా.. జాక్ అంతర్థానమవుతుందా? ఇవి జేఏసీలో ఉన్న నేత‌ల అనుమానాలు, సందేహాలు!

తాను వేరే పార్టీలో చేరినా టీజాక్ యథావిధిగా కొనసాగుతుందని కోదండరాం ఇటీవల వెల్ల‌డించారు. దీంతో టీజాక్‌ను రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన ఆయనకు లేదని దాదాపు స్పష్టమైంది. కానీ రాజకీయ పార్టీగా జేఏసీ అవతరించకపోతే అది నిర్వహించే కార్యకలాపాలు, కార్యక్రమాలు ఏమీ ఉండవని కొందరు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి ఇక జేఏసీ తో పనేమి ఉండదని, దానిని రాజకీయ పార్టీగా మార్పు చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్-వామపక్షాలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగితే టీఆర్‌ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అసహనంతో ఉన్న ప్రజాసంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని వారు వాదిస్తున్నారు.

కోదండరాం ఒంటెద్దు పోకడ పోతున్నారని, ఏ విషయాన్నీ స్టీరింగ్ కమిటీలో చర్చించకుండా స్వతహాగా నిర్ణయం తీసుకుని మీడియాకు వెల్లడిస్తున్నారని టిజాక్ వైస్-చైర్మన్ ప్రహ్లాద్, రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, కో-కన్వీనర్ తన్వీర్ సుల్తానా ఈ నెల 1న బహిరంగంగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో మరో రాజకీయ పార్టీ అవశ్యకత ఉందని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించడంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజేఏసీ ని రాజకీయ పార్టీగా మార్చబోమని చెబుతూనే మరో రాజకీయ పార్టీ అవసరం ఉందని సంకేతం ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటీ?, కొత్త పార్టీ రూపకల్పన ఎవరు చేస్తున్నారు? ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించకుండా బయట బహిర్గతం చేయడాన్ని జేఏసీ సభ్యులు తప్పుపడుతున్నారు. ఏదైనా స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని వారు పట్టుబడుతున్నారు.

కోదండరాంకు వేరే పార్టీలో చేరాలన్న ఆలోచన ఉన్నా, తామెవ్వరమూ అడ్డుపడమని చెప్తున్నారు. లేదా టీజేఏసీని పార్టీగా మార్చాలనుకుంటే స్టీరింగ్ కమిటీలో ఎంత మంది ఆమోదిస్తారో, ఆమోదించరో తేలిపోతుందని వారు చెబుతున్నారు. ఇంత కీలకమైన అంశాలపై చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకుండా కోదండరాం కాలయాపన చేయడం తగదని కొందరు అంటున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం 30కి పైగా విద్యార్థి సంఘాలతో కోదండరామ్ చర్చించినట్లే, టీజాక్ భవిష్యత్తుపైనా స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ విష‌యంలో ఆచార్యుల వారు ఏం చేస్తారో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు