జైలు మీకేమైనా కొత్తా జగన్ – ఉండవల్లి

సంచలన వ్యాఖ్యలు చేయటంలో సీనియర్ నేత ఉండవల్లి ముందుంటారు. అద్భుతమైన వాగ్ధాటి.. అంతకు మించి ఆయన మాటల్లో లాజిక్కు కట్టిపారేస్తూ ఉంటుంది. తెలుగు నేల మీద విషయాల మీద విపరీతమైన పట్టుతో పాటు.. అంతకు మించిన విషయం ఏదైనా సరే.. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాల్ని ఆయన చెప్పేస్తుంటారు. అలాంటి ఉండవల్లి.. తాజాగా సీఎం జన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటు చేతుల్లో పెట్టాలని డిసైడ్ చేసిన వేళ.. అందుకు వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపునివ్వటమే కాదు.. వైఎస్ఆర్ కొడుకుగా భయపటం అనేది ఉండొద్దని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడిన ఉండవల్లి.. ఈ అంశంపై జగన్ ఎలా రియాక్ట్ కావాలో చెప్పే ప్రయత్నం చేశారు.

‘‘జైలుకు వెళ్లటం కొత్తా నీకు. పోతే జైలుకే పోతారు. జైలుకెళ్లు. దేనికి భయపడటం? ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. ఇవాళ మీరు కానీ వెనకడుగు వేస్తే.. అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలుస్తారా? లేదంటే మోడీ.. అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి’’ అని పేర్కొన్నారు.

51 శాతం ఓట్లు.. 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదని.. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సింది కాదన్నారు. రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపనలు చేసుకుంటున్నాయి. అవినీతి కారణంగా కేంద్రంతో పోరాడలేకపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని.. భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు భయపడాలి? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి విశాఖలో సెమినార్ పెట్టాలని.. వైజాగ్ డిక్లరేషన్ ఇద్దామన్న ఉండవల్లి మాటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో?