వైసీపీలో ఆ రెడ్డి ఎమ్మెల్యేకు జ‌గ‌న్ బ్రేక్‌?

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. సొంత పార్టీతో అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటున్నారు.. ఏకంగా ముఖ్య‌మంత్రినే టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. పార్టీలో ఉంటే ఉండొచ్చు.. బ‌య‌ట‌కు వెళితే వెళ్ల‌వ‌చ్చ‌ని అధిష్టానం వార్నింగ్ ఇవ్వ‌డంతో గ‌ప్‌చుప్ అయినా లోప‌ల మాత్రం ర‌గిలిపోతున్నారు. త‌న సీనియార్టీని పార్టీ గుర్తించ‌లేద‌ని తెగ మ‌ద‌న‌ప‌డుతోన్న ఆయ‌న ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేళ పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డి. రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న ఆనం ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీలో చేరింది. చంద్ర‌బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ( ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న కోపంతో) వైసీపీలోకి జంప్ అయ్యారు.

జ‌గ‌న్ వెంక‌ట‌గిరి సీటు ఇవ్వ‌గా అక్క‌డ ఘ‌న‌విజ‌యం సాధించిన ఆనంకు ఇక్క‌డా మంత్రి ప‌ద‌వి ఆశ‌తీర‌లేదు. పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయ‌న ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేళ అస‌లేమాత్రం ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదో పేరుకు మాత్ర‌మే ఆయ‌న వెంక‌ట‌గిరికి ఎమ్మెల్యేగా.. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయ‌న తీరు మాత్రం ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేను త‌ల‌పిస్తోంది. ఉప ఎన్నిక స‌న్నాహక స‌మావేశానికి ఇలా వ‌చ్చి అలా వెళ్లిన ఆయ‌న త‌ర్వాత త‌న నియోజ‌వ‌క‌ర్గంలో పార్ల‌మెంటు ఎన్నిక ప్ర‌చారం ప‌ట్టించుకోవ‌డం లేదు.

అధిష్టానం సైతం ఆనంపై న‌మ్మ‌కం లేకే.. వెంక‌ట‌గిరి బాధ్య‌త‌లు ఇద్ద‌రు మంత్రుల‌కు అప్ప‌గించింది. మ‌రోవైపు వైసీపీ ఇక్క‌డ మూడు ల‌క్ష‌ల మెజార్టీ టార్గెట్‌గా ప‌ని చేస్తోంది. ఈ స‌మ‌యంలో ఆనం లాంటి సీనియ‌ర్ మౌనంగా ఉండ‌డం పార్టీకి, పార్టీ ల‌క్ష్యానికి ఇబ్బందే అని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే ఆనం దూకుడుకు జ‌గ‌న్ పూర్తిగా బ్రేకులు వేసేశారు. ర‌ఘురామ కృష్ణంరాజును పార్టీ నుంచి ఎలా వ‌దులుకున్నారో ? ఆనంను కూడా అలాగే వ‌దులుకుంటామ‌ని ప‌రోక్షంగా సంకేతాలు కూడా పంపేశారు.

ఈ మూడేళ్లు ఇష్టం ఉన్నా లేక‌పోయినా ఆనం వైసీపీ ఎమ్మెల్యేగానే ఉంటారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇదే పార్టీలో ఉన్నా టిక్కెట్ వ‌చ్చే ఛాన్స్‌లేదు. మ‌ళ్లీ కండువా మారుస్తారా ? లేదా రాజ‌కీయ స‌న్యాసం చేస్తారా ? అన్న‌ది మాత్రం చూడాలి.