చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న కు ఎందుకంత క్రేజ్?

చింతపండు నవీన్? ఎవరితను? అన్న సందేహం వస్తుంది. అదే తీన్మార్ మల్లన్న అన్న పేరు పలికినంతనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుపరిచితుడు. అచ్చ తెలంగాణ యాసలో.. మొహమాటం లేకుండా బరాబర్ సీఎం కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే ఏకైక వీరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. సామాన్యుల్లో సోషల్ మీడియా ఆదరణ ఎంత పెరిగిందన్న దానికి నిదర్శనంగా తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన ఆయన.. ప్రొఫెసర్ కోదండం మాష్టారి కంటే అత్యధిక ఓట్లను దక్కించుకొని సంచలనంగా మారారు. అంతేనా.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చమటలు పోసేలా.. ఆయనకు ధీటుగా ఓట్లు దక్కించుకోవటం ద్వారా ఇప్పుడాయన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థితో పోటీ పడి.. ప్రధమ ప్రాధామ్నాయ ఓట్లను దక్కించుకోవటంలో ఆయన సాధించిన విజయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ అంశం మల్లన్నకు అన్ని ఓట్లు పడేలా చేసింది? ఒక యూట్యూబ్ చానల్ పెట్టి.. పొద్దున్నే.. ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లను రివ్యూ చేయటం.. ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని.. ప్రభుత్వాధినేతను ఉద్దేశించి తీవ్రంగా చేసే వ్యాఖ్యలు.. విమర్శలు.. ఆరోపణలు లాంటివి ఆయనకు అతి తక్కువ కాలంలోనే.. విలక్షనమైన వ్యక్తి అన్న గుర్తింపును తెచ్చి పెట్టింది.

తన మీద కేసులు ఎన్ని నమోదైనా.. ఆరోపణలు ఎన్ని వచ్చినా.. అరెస్టు చేసినా లెక్క చేయకుండా అదే పనిగా తన వాదన మీద బలంగా వాదనలు వినిపించే మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను విపరీతంగా ఆకర్షించారు. వాస్తవానికి.. ఈ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు.. పలువురు ప్రముఖులు పోటీలో పాల్గొనటంతో పల్లా బయటపడిపోయారే కానీ.. అందుకు భిన్నంగా విపక్షాల తరఫున ఒకే అభ్యర్థి అని మల్లన్నను బరిలో దింపి.. అన్ని విధాలుగా సాయం చేస్తే.. తుది ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ ఆయనకు అంత క్రేజ్ వెనుక రహస్యం ఏమంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి.. ఘాటుగా విమర్శలు చేయటం.. ఆయనకు మాదిరే.. ఆయన ఉపయోగించిన తిట్లను సందర్భానికి తగినట్లుగా తిట్టేయటం ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. కేసీఆర్ ను ఉద్దేశించి ఏమైనా అనగలిగిన ఒకే ఒక్క మగాడిగా మల్లన్నను అభివర్ణిస్తున్నారు. ఈ కారణంతోనే.. తాజా ఎన్నికల్లో ఆయనకు అన్ని ఓట్లు రావటానికి కారణమ్న మాట బలంగా వినిపిస్తోంది.