తమిళ ఎన్నికల్లో తెలుగువాళ్ళ ప్రభావం ఎంతో తెలుసా ?

తొందరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం చాలా ఎక్కువగానే ఉన్నట్లుంది. దశాబ్దాలుగా తమిళనాడులో స్ధిరపడిపోయిన తెలుగు వాళ్ళు వర్తక, వాణిజ్య రంగాల్లోనే కాకుండా విద్యారంగంతో పాటు రాజకీయరంగంలో కూడా గట్టి ప్రబావమే చూపుతున్నారు. తమిళ రాజకీయాల్లో ఒకేపార్టీకని కాకుండా ఎవరిష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు చేరటంతో అన్నీ పార్టీల్లోను ఇపుడు తెలుగువారి ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఇటు అధికార అన్నాడీఎంకేతో పాటు డీఎంకే, డిఎండీకే, ఎండిఎంకే పార్టీల తరపున సుమారు 20 మందికి పైగా తెలుగు వాళ్ళు అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. అన్నీడీఎంకే తరపున తాంబరం, తిరువూరు జిల్లాలోని అవినాశి, తూత్తుకుడి జిల్లాలోని కోవిల్ పట్టి, కృష్ణగిరి జిల్లాలోని హోసూరు, చెన్నైలోని టీ నగర్, కొళత్తూరు, అన్నానగర్, ఆర్కేనగర్, విల్లివాక్కం, ధర్మపురి జిల్లాలోని పాపిరెడ్డిపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.

అలాగే డీఎంకే తరపున తిరుచ్చి వెస్ట్, తిరువణ్ణామలై, చెన్నైలోని అన్నానగర్, హార్బర్, సైదాపేట, హోసూరు నియోజకవర్గాల్లో తెలుగు వారే పోటీ చేస్తున్నారు. అన్నానరగ్, హార్బర్, హోసూరు, సైదాపేట లాంటి నియోజకవర్గాల్లో అయితే అన్నీపార్టీలు తెలుగు వాళ్ళనే పోటీలోకి దింపాయి. అంటే ఏ స్ధాయిలో తమిళనాడులో ప్రత్యేకించి చెన్నైలో తెలుగువారి ప్రభావం ఉందో అర్ధమైపోతోంది.

2013లో ఓ స్వచ్చంధ సంస్ధ సర్వే ప్రకారం తమిళనాడులో సుమారు 50 లక్షల మంది తెలుగువాళ్ళున్నట్లు తేలింది. చెన్నైతో పాటు తిరువళ్ళూరు, దిండిగల్, విరుదనగర్, తేని, కోయంబత్తూరు, కృష్ణగిరి జిల్లాల్లో తెలుగువారి ప్రభావం చాలా ఎక్కువ. అందుకనే పై జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఏదైనా పోటీచేసేది మాత్రం తెలుగువాళ్ళే అయ్యుంటారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగువాళ్ళ ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి. ఉమ్మడి మద్రాసును ఏలిన పానగల్ రాజు, ప్రకాశం పంతులు, ఓమండూరు రామస్వామిరెడ్డి, కుమారస్వామిరాజా, బొబ్బిలి రాజా, బీ మునస్వామి లాంటి వాళ్ళంతా తెలుగు వాళ్ళే. చివరకు చెన్నై మొదటి మేయర్ పిట్టి త్యాగరాజ చెట్టి కూడా తెలుగు వ్యక్తే.

అంతెందుకు తర్వాత కాలంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా చేసిన పెరియార్ రామస్వామి నాయకర్, కరుణానిధి తెలుగువారే. జయలలితకు కూడా తెలుగు మూలాలున్నాయి. ఇలా చెప్పుకుంటు పోతే తమిళనాడుపై తెలుగువాళ్ళ ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి.