అనుకున్నదే జరిగింది: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు బాబు.. నారాయణ

రాజధాని అమరావతి భూముల సేకరణలో ఎస్సీ.. ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఆయనతో పాటు.. నాడు మంత్రిగా వ్యవహరించిన నారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారానికి కారణమైంది. పెద్ద ఎత్తున చర్చతో పాటు.. చంద్రబాబుకు జగన్ సర్కారు భారీ షాకిచ్చిందన్న చర్చ నడుస్తోంది.

ఈ నోటీసులపై చంద్రబాబు ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఇప్పటివరకు వేసుకున్న అంచనానే నిజమైంది. కోర్టును ఆశ్రయించి.. తనకు ఇచ్చిన నోటీసులపై స్టే తెచ్చుకునే వీలుందన్న మాటకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిన తర్వాత.. ఈ నోటీసులపై పెద్ద ఎత్తున అధ్యయనం చేసిన టీడీపీ తరఫు న్యాయవాదులు తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

సీఐడీ దాఖలు చేసిన కేసులపై చంద్రబాబు.. నారాయణలు అధికారుల ఎదుట హాజరు కాకుండా ఉండేలా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ కేసులపై వారిద్దరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ పోలీసుల తయారు చేసిన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం బాబు.. నారాయణ తరఫున న్యాయవాదులు హైకోర్టు ఎదుట హాజరై.. క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 41 ఏ కింద ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో సోదాలు నిర్వర్తిస్తున్న వైనాన్ని అడ్డుకోవాలని కోరారు. వెంటనే తమ పిటిషన్ పై విచారణ జరపాలన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం చేపడతామని పేర్కొంది. మరి.. ఈ అంశంపై హైకోర్టు ఏం చెబుతుంది? ఎలాంటి ఆదేశాల్నిజారీ చేస్తుందో తేలటానికి రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే.