లాక్ డౌన్ ఎత్తేసినా సినిమాల‌కు క‌ష్ట‌మే

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో కుదేల‌వుతున్న రంగాల్లో సినీ రంగం కూడా ఒక‌టి. ఫిబ్ర‌వ‌రి-మార్చి మ‌ధ్య అన్ సీజ‌న్లో అప్ప‌టికే వ‌సూళ్లు బాగా ప‌డిపోయి స్లంప్ న‌డుస్తున్న స‌మ‌యంలో క‌రోనా వ‌చ్చి పూర్తిగా థియేట‌ర్ల‌కు తెర‌దించేసింది. షూటింగులు ఆపించేసింది. దీంతో రెండు నెల‌ల‌కు పైగా సినీ రంగం ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటోంది.

మ‌ళ్లీ మామూలు ప‌రిస్థితులు ఎప్పుడొస్తాయో.. సినీ కార్య‌క‌లాపాల‌న్నీ ఎప్పుడు మొద‌ల‌వుతాయో.. థియేట‌ర్ల‌లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఎప్ప‌టికి ఆరంభ‌మ‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏప్రిల్ 14 వ‌ర‌కు ఉన్న లాక్ డౌన్‌ను నెలాఖ‌రు వ‌ర‌కు కొన‌సాగించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా.. వెంట‌నే థియేట‌ర్ల‌లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తులిస్తారో లేదో తెలియ‌దు.

ఒక‌వేళ అనుమ‌తులిచ్చినా.. కొంత కాలం పాటు మునుప‌టిలా అయితే సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌ద‌న్న‌ది స్ప‌ష్టం. థియేట‌ర్ల‌లో ఒక సీటు త‌ర్వాత ఒక సీటు ఖాళీ వ‌దల‌డం త‌ప్పేలా లేదు. అలాగే థియేట‌ర్ల‌లో శానిటైజేష‌న్ కోసం.. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, ప్రేక్ష‌కుల‌కు ప‌రీక్ష‌లు చేయ‌డానికి థ‌ర్మామీట‌ర్ల కోసం అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత చేసినా జ‌నాలు వెంట‌నే థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే.  

మొత్తంగా చూస్తే మామూలు రోజుల్లో వ‌చ్చే రెవెన్యూతో పోలిస్తే స‌గం వ‌స్తే ఎక్కువ‌. కాబ‌ట్టి థియేట‌ర్లు తెరుచుకున్నాక తొలి రెండు నెల‌ల్లో సినిమాల‌కు క‌ష్ట కాలం అన్న‌ట్లే. ఈ స‌మ‌యంలో త‌మ సినిమాలు రిలీజ్ చేసుకోవ‌డానికి ఎవ‌రు ముందుకొస్తారో చూడాలి.

లాక్ డౌన్ స‌మ‌యానికి నాని మూవీ వితో ఉప్పెన‌, అర‌ణ్య‌, రెడ్ లాంటి సినిమాలు రెడీ ఫ‌ర్ రిలీజ్ అన్న‌ట్లున్నాయి. కానీ లాక్ డౌన్ ఎత్తేసి థియేట‌ర్లు తెరుచుకున్నా రెవెన్యూ బాగా త‌క్కువ వ‌చ్చే అవ‌కాశ‌మున్న నేప‌థ్యంలో ఈ సినిమాల్ని రిలీజ్ చేయ‌డానికి మొగ్గు చూపుతారా అన్న‌ది సందేహ‌మే.