తిరుప‌తి బ‌రిలో ఓట్ల చీలిక‌.. భారీ వ్యూహానికి వైసీపీ క‌స‌ర‌త్తు!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస‌గా ఇక్క‌డ విజ‌యం సాధిస్తున్న వైసీపీ.. 2014, 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంట‌ను చేజిక్కించుకుంది. అయితే.. అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కుడు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిని వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమం.. కేంద్రంతో అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. ఇప్పు డున్న ప‌రిస్థితిలో ఎంతో కొంత వ్య‌తిరేక‌త అయితే.. పార్టీకి ఉంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. తిరుమ‌ల ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డం.. జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతుండ డం నేప‌థ్యంలో ఇక్క‌డ హిందూ స‌మాజం నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ కాంగ్రెస్ పార్టీ(బ‌హుశ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఈ పేరు కూడా విని ఉండ‌రు)ని ఇక్క‌డ పోటీకి దింపేలా తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డికి అత్యంత విన‌య విధేయుడిగా గుర్తింపు పొందిన మూలింటి మారెప్ప‌ను తిరుప‌తి బ‌రిలో నిల‌బ‌డేలా ప్రోత్స‌హిస్తు న్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వైఎస్ ప్ర‌భుత్వంలో మూలింటి మారెప్ప మంత్రిగా కూడా ప‌నిచేశారు. క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు విజ‌యం సాదించిన ఆయ‌న రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.

అయితే.. ఇప్పుడు మాత్రం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో తాను పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు మారెప్ప తాజాగా వెల్ల‌డించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు పొందిన మారెప్ప‌.. తాజాగా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం.. అనూహ్యంగా తిరిగి రాజ‌కీయాల్లోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదంతా కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చి.. తాము గెలుపు గుర్రం ఎక్కేందుకు దోహ‌ద‌ప‌డేలా వైసీపీ నేతలు వ్యూహాత్మ‌కంగా క‌దుపుతున్న పావేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.