కేసీఆర్ ను కదిలించని 41 లేఖలు

కేసీఆర్ ను కదిలించని 41 లేఖలు

వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై ప్రస్తుత కేంద్ర మంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయ లేఖాస్త్రాలు సంధించేవారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి ప్రజా సమస్యలు తేవడానికి సీపీఎం కూడా అలాంటి లేఖల మార్గాన్నే ఎంచుకుంది. అయితే.. అప్పట్లో వైఎస్.. దత్తాత్రేయ లేఖల్లో కొన్నిటికి స్పందించారు కానీ, కేసీఆర్ మాత్రం ఇప్పుడు సీపీఎం లేఖలన్నీ చెత్తబుట్టలో పడేస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ గత 50 రోజుల్లో సీపీఎం నేతలు 41 లేఖలు రాశారు. అందులో ఏ ఒక్కదానికీ కేసీఆర్ చలించలేదు.
   
దీంతో కేసీఆర్ తీరుపై సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డిజి నరసింహారావు విరుచుకుపడుతున్నారు. 'సామాజిక న్యాయం - రాష్ట్ర సమగ్రాభివృద్ధి' అజెండాగా ఇబ్రహీంపట్నంలో అక్టోబర్ 17న తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మహాజన పాదయాత్ర ప్రారంభించారు...  ఈ మహాజన పాదయాత్ర ఇప్పటికే  9 (కొత్త) జిల్లాల్లో 1250 కిలో మీటర్ల మేర సాగింది.

ఈ సందర్భంగా వారి దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి 41 లేఖలు రాశారు. కానీ ఏ ఒక్క లేఖకూ ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదట.  వివక్షత, పెత్తందార్ల దోపిడీతో, పెన్షన్ల కోత, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, స్మశానవాటికలు, 3 ఎకరాల భూపంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల రుణ మాఫీ, గిట్టుబాటు ధర లభించకపోవడం, మైనారిటీల రిజర్వేషన్లు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలపై లేఖలు రాసినట్లు సీపీఎం నేతలు చెబుతున్నారు.
   
దీంతో లేఖల మార్గం మానుకుని కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు వారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 15వ తేదీ వరకు మండల, పట్టణ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించబోతున్నారు.  జనవరి 3 నుంచి గ్రామాల్లో సైకిల్, వాహనాల యాత్రలు కూడా చేపడతారట.  జనవరి 15 నుంచి 30 వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశాక.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరిలో ధర్నాలు, నిరాహార దీక్షలకు దిగుతామని సీపీఎం హెచ్చరిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు