కరోనా దెబ్బ మామూలుగా లేదుగా !

ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ స్ధాయిలో వణికించేసిందో అందరు చూస్తున్నదే. యావత్ ప్రపంచం ఎలా దెబ్బతిన్నదో మనదేశం కూడా అంతే స్ధాయిలో దెబ్బతింది. తాజాగా కేంద్రప్రభుత్వంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశం మొత్తంమీద 10 వేల కంపెనీలు మూతపడ్డాయట. కరోనా వైరస్ దెబ్బకు తట్టుకోలేక 10113 కంపెనీలు స్వచ్చంధంగానే మూతపడ్డాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక కార్యకలాపాల మీద తీవ్రంగా దెబ్బ పడింది. పరిశ్రమలు, టూరిజం, హోటల్, వర్తక, వాణిజ్య రంగాలకు చెందిన వేలాది పరిశ్రమలపై చావు దెబ్బ పడింది. మూతపడిన పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయంతో సంబంధం లేకుండానే వాటి యాజమాన్యాలు స్వచ్చంధంగానే మూత వేసేశారు. అత్యధికంగా ఢిల్లీలో 2394 కంపెనీలు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో 1936 కంపెనీలు మూతపడ్డాయి.

తమిళనాడులో 1322, మహారాష్ట్రంలో 1279, కర్ణాటకలో 836, చండీఘడ్ లో 501, రాజస్ధాన్ లో 479, తెలంగాణాలో 404, కేరళలో 307, ఝార్ఖండ్ లో 137, మధ్యప్రదేశ్ లో 111, బీహార్లో 104 కంపెనీలు స్వచ్చంధంగా మూతపడ్డాయట. కరోనా వైరస్ కారణంగా తమంతట తాముగా కార్యకలాపాలను నిలిపేసిన కంపెనీల జాబితాను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంతో పై విషయాలు బయటపడ్డాయి.

కేంద్రం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారమే 10113 కంపెనీలు, ఫ్యాక్టరీలు మూత పడ్డాయటంటే అందులోని ఉద్యోగుల సంఖ్యే లక్షల్లో ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక పరోక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. అమెరికాలో సుమారు 3 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారని చెప్పుకున్నాం. మన దేశంలో ఎంతమంది ఉద్యోగ, ఉపాధి పోగొట్టుకున్నారనే విషయంలో స్పష్టత లేదు.