ఆంధ్రాలో కేటీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై గడిచి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ఫలితం రాని వేళ.. కేంద్రమంత్రి లోక్ సభలో విశాఖ ఉక్కును అమ్మేయటం తప్పించి మరో మార్గం లేదని తేల్చేసిన వేళ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ వాసులకు సరికొత్త ఆశాకిరణంగా మారారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇవాళ విశాఖ ఉక్కు అవుతుంది. రేపు బీహెచ్ఈఎల్ అవుతుంది.. తర్వాత బయ్యారం అవుతుంది.. ఆ తర్వాత సింగరేణి అవుతుంది. ఈ తీరును తప్పు పట్టాల్సిందే. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతి తీసుకొని విశాఖకు వస్తాం.. మద్దతు ఇస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి జరుగుతున్న పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించటంపై ఏపీలోని పలువురు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేటీఆర్ మాటలకు జై కొడుతున్నారు. కేటీఆర్ ఫోటోలకు విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులతోపాటు.. అక్కడి ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి పోరాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందామని కోరుతున్నారు.

విశాఖ ఉక్కుకు మద్దతు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలోని వారికి కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. వస్తామంటేనే ఇంత స్పందన వచ్చిన వేళ.. ఇక.. విశాఖ టూరుకు కానీ బయలుదేరితే.. కేటీఆర్ అండ్ కో బ్రహ్మరథం పట్టటం ఖాయమని చెప్పక తప్పదు. మరి.. మాటల్లో చెప్పిన మాట కేటీఆర్ చేతల్లో చూపిస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.