ఉక్కు ఆందోళనకు తెలంగాణా మద్దతు

రాష్ట్రానికి సంబంధించిన మేజర్ ఇష్యుకి తెలంగాణా సమాజం కూడా మద్దతుగా నిలుస్తోంది. మామూలుగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఏపిలో జరిగే ఆందోళనలకు, ఉద్యమాలకు తెలంగాణా ప్రభుత్వం తరపున అధికారికంగా మద్దతు రాలేదనే చెప్పాలి. అలాంటిది తాజాగా జరుగుతున్న ఉక్కు ఆందోళనలకు తెలంగాణా కూడా మద్దతు ఇస్తున్నట్లు మంత్రి కేటీయార్ బహిరంగంగా ప్రకటించారు.

ఒక సమావేశంలో కేటీయార్ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో విశాఖలో జరుగుతున్న ఆందోళనలకు తెలంగాణా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అవకాశం ఉంటే నేరుగా విశాఖకు వెళ్ళి ఉద్యమంలో పాల్గొంటామని కూడా చెప్పారు. కేటీయార్ తాజా ప్రకటనను బట్టి విశాఖ ఉక్కు ఆందోళనలకు పొరుగు రాష్ట్రం కూడా మద్దతు ప్రకటించటం సానుకూల అంశమనే చెప్పాలి.

గతంలో కూడా ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఏపిని మోసం చేసినపుడు కూడా ఏపి ప్రయోజనాలకు మద్దతుగానే కేసీయార్ మాట్లాడారు. అయితే ప్రత్యేకహోదా ఏపికి మాత్రమే కాదని తెలంగాణాకు కూడా కావాలని డిమాండ్ చేశారు. ఏదైనా సందర్భం వచ్చినపుడు కల్వకుంట్ల కవిత కూడా ఏపికి మద్దతు ప్రకటించిన ఘటనలున్నాయి. అంతేకానీ తాము నేరుగా వెళ్ళి ఆందోళనల్లో పాల్గొంటామని ప్రకటించటం మాత్రం ఇదే మొదటిసారి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణా మద్దతు ప్రకటన వెనుక ఓ కారణం కూడా ఉండచ్చు. తెలంగాణాలో బీజేపీకి అధికార టీఆర్ఎస్ కు బద్ధ వైరం నడుస్తోంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో కేసీయార్+కేటీయార్ కు వ్యక్తిగత మిత్రత్వం ఉంది. అలాగే కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధని కల్పిస్తున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయటాన్ని వీళ్ళు సహించలేకపోతున్నట్లున్నారు. ఎందుకంటే ఇపుడు సమస్య ఏపిదని ఊరుకుంటే రేపు తెలంగాణాలో కూడా ఇదే జరగచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా కేటీయార్ ఆందోళనలకు మద్దతు ప్రకటించారేమో.