పవన్ లో అసంతృప్తి...హోం మంత్రి ఓ డమ్మీ

పవన్ లో అసంతృప్తి...హోం మంత్రి ఓ డమ్మీ

జనసేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ గురించి సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌న‌సేన అధినేత‌తోరామ‌కృష్ణ స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశం గురించి మీడియాకు వివ‌రిస్తూ...ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన స‌మ‌యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన చర్చించామన్నారు.

అంశాలన్నింటిపైనా పవన్‌కళ్యాణ్‌ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. పవన్‌తో కలిసి చర్చించిన అంశాలను త‌మ మ‌రో మిత్ర‌ప‌క్ష‌మైన సీపీఎం దృష్టికి కూడా తీసుకువెళ్ల‌నున్న‌ట్లు రామ‌కృష్ణ తెలిపారు.  రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాలు  కలిసి పని చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

మ‌రోవైపు ఏపీ హోం మంత్రి  నిమ్మ‌కాయ‌ల చినరాజప్ప ప‌నితీరును  రామకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జ‌రిగిన‌ వ‌రుస సంఘ‌ట‌నలు ఉద‌హ‌రిస్తూ ఏపీలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, సమస్యలపై ఆందోళన చేస్తే ప్రజాస్వామ్య హక్కును కూడా కాలరాస్తుందని విమ‌ర్శించారు. అయితే ఈ బాధ్య‌త‌లు చూసుకోవాల్సిన హోంమంత్రి నిమిత్తమాత్రుడని రామ‌కృష్ణ ఎద్దేవా చేస్తూ శాంతిభద్రతలన్నీ పోలీసుల చేతుల్లో పెట్టేశారని విమర్శించారు.

విజ‌య‌వాడ‌లో రామ‌కృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా ధారకొండలో ఓ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన తమపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించారని పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా వామపక్ష నేతలు ఎక్కడ సమస్యలపై ఆందోళనకు దిగితే అక్కడ ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు బరితెగించారని, ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చిన్న ప్రదర్శన చేయాలన్నా అనుమతించడం లేదన్నారు.

ఈ పోలీస్‌ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్‌ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. దళిత, మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, దళిత, మైనార్టీలపై దాడులు నిరసిస్తూ, లౌకిక వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 6న అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.