దీపావళికి ‘అమ్మ’ డిశ్చార్జ్ లేనట్లేనట

దీపావళికి ‘అమ్మ’ డిశ్చార్జ్ లేనట్లేనట

తమిళనాడు ప్రజలంతా ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న అమ్మ డిశ్చార్జ్ కార్యక్రమం వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 22న అమ్మను చెన్నై అపోలోకు తరలించటం.. చూస్తుండగానే నెల రోజులు గడిచిపోవటం తెలిసిందే. ఆసుపత్రి లోపలకు వెళ్లిన నాటి నుంచి ఇప్పటి వరకూ అమ్మ ఎలా ఉన్నారన్న అంశంపై అప్పుడప్పుడు వచ్చే అధికారిక బులిటెన్లు తప్పించి.. ఒక ఫోటోకానీ.. వీడియో కానీ బయటకు రాని పరిస్థితి.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు.. పలువురు కేంద్ర మంత్రులు అమ్మను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చినా.. వైద్యుల సూచన మేరకు అమ్మను చూడకుండా.. డాక్టర్లతో మాట్లాడి వెళుతున్న వైనం తెలిసిందే. అమ్మకు వైద్యం చేయటం కోసం లండన్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డాక్టర్ రిచర్డ్ బీలే.. లండన్ టు చెన్నై షటిల్ కొడుతున్నారు. తాజాగా మరోసారి చెన్నైకి వచ్చిన ఆయన.. అమ్మ కోలుకుంటున్న తీరును.. ఆమెకు చేస్తున్న వైద్యాన్ని తాజాగా రివ్యూ చేసినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమ్మ డిశ్చార్జ్ అందరూ అనుకుంటున్నట్లుగా దీపావళికి ముందుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదని.. అన్ని బాగుంటే.. పది నుంచి పదిహేను రోజుల తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని.. వైద్యుల నేతృత్వంలో ఆమెకు వైద్యం సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. దీంతో.. తమిళనాడు వ్యాప్తంగా ఈ దీపావళి హుషారుగా ఉండదన్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు