కొత్త సినిమాల‌కు ఉప్పెన షాక్

ఉప్పెన ఏమీ భారీ చిత్రం కాదు. ఈ సినిమాకు రిలీజ్ ముందు మంచి హైప్ రావ‌డం, టాక్ కూడా బాగుండ‌టంతో ఓపెనింగ్స్ ఊహించ‌ని స్థాయిలో వ‌చ్చాయి. ఐతే ఈ సినిమా వారాలు వారాలు ఆడేస్తుంద‌న్న అంచ‌నాలేమీ లేవు. ఈ వారం మూడు కొత్త సినిమాలు రిలీజ‌వుతుండ‌టంతో వాటి పోటీని త‌ట్టుకుని ఉప్పెన నిల‌వ‌గ‌ల‌దా.. తొలి వారం జోరు కొన‌సాగించ‌గ‌ల‌దా అన్న సందేహాలు క‌లిగాయి. కానీ ఆ సందేహాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ కొత్త సినిమాల‌కు షాకిచ్చే వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది ఈ ప్రేమ‌క‌థా చిత్రం.

మామూలుగా కొత్త చిత్రాల‌కు తొలి వారాంతంలో టాక్‌తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్స్ ప‌డుతుంటాయి. కానీ నాంది, క‌ప‌ట‌ధారి, చ‌క్ర చిత్రాలకు ఆ సంద‌డి క‌నిపించ‌డం లేదు. నాంది చిత్రానికి ఉన్నంత‌లో వ‌సూళ్లు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆ సినిమాకు హౌస్ ఫుల్స్ ప‌డే ప‌రిస్థితి లేదు. ఆక్యుపెన్సీ మాత్రం బాగుంది. క‌ప‌ట‌ధారి ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉండ‌గా.. చ‌క్ర ప‌రిస్థితి ఓ మోస్త‌రుగా ఉంది.

ఇక ఉప్పెన విష‌యానికొస్తే ఈ చిత్రం రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతూ ట్రేడ్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. శ‌నివారం ఫ‌స్ట్ షోలు దాదాపుగా మేజ‌ర్ సిటీల‌న్నింట్లో ఫుల్స్ అయ్యాయి. ఆదివారం వ‌సూళ్లు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. మ్యాట్నీ, ఫ‌స్ట్ షోల‌కు ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డుస్తోంది ఉప్పెన‌. ట్విట్ట‌ర్‌లో బాక్సాఫీస్ హ్యాండిల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజ‌ర్ సిటీల్లో ఈ సినిమాకు రెండు షోలూ ఫుల్స్ ప‌డ్డ‌ట్లు అప్ డేట్స్ ఇస్తున్నాయి.

ఈ వారం వ‌చ్చిన కొత్త సినిమాల‌కు ఆ ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల ఫస్ట్ ప్ర‌యారిటీ చిత్రం ఉప్పెన‌నే అన‌డంలో మ‌రో మాట లేదు. రెండో ప్ర‌త్యామ్నాయంగా నాంది చిత్రాన్ని చూస్తున్నారు. వ‌చ్చే వారం చెక్ వ‌చ్చే వ‌ర‌కు ఉప్పెన జోరు కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ సినిమా టాక్‌ను బ‌ట్టి వ‌చ్చే వీకెండ్లో ఉప్పెన బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఆధార ప‌డి ఉండొచ్చు. ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ మార్కుకు ద‌గ్గ‌ర‌లో ఉండ‌టం విశేషం.