రఘువరన్‌పై ట్వీట్లు.. ఎమోషనల్ అయిన రోహిణి

దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు రఘువరన్. ఆయన విలక్షణ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రఘువరన్ లాంటి విలన్ సౌత్‌లోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఐతే కేవలం 50 ఏళ్ల వయసులోనే.. ఇంకా చాలా కెరీర్ ఉండగానే రఘువరన్ హఠాత్తుగా చనిపోయాడు.

ఆయన మరణించి అప్పుడే 12 ఏళ్లు అయిపోయింది. ఇటీవల బాలీవుడ్ లెెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా తక్కువ వయసులోనే క్యాన్సర్ కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలక్షణ నటులైన ఇర్ఫాన్‌కు, రఘువరన్‌కు మధ్య పోలిక పెడుతూ ట్విట్టర్లో ఒక చర్చ నడిచింది. ఓ జర్నలిస్టు వీళ్లిద్దరూ నటనలో సమానం.. ఔనా, కాదా అంటూ ఒక చర్చకు తెరతీసింది.

దీనిపై ఎంతోమంది నెటిజన్లు స్పందించారు. కొందరు రఘువరన్‌ను మించిన నటుడు లేడని.. ఆయనకు ఎవరితోనూ పోలిక పెట్టలేమని అన్నారు. ఇంకొందరు రఘువరన్, ఇర్ఫాన్ ఎవరికి వారే సాటి అని.. ఇద్దరూ లెజెండ్సే అన్నారు. కొందరు మాత్రం రఘువరన్ కామెడీ చేయలేడని.. ఇర్ఫాన్ అందులోనూ మేటి అన్నారు. మరికొందరేమో.. రఘువరన్‌లా ఇర్ఫాన్ విలనీ పండించలేడని అన్నారు.

ఐతే ఈ సందర్భంగా చాలామంది రఘువరన్ పోషించిన గొప్ప గొప్ప పాత్రలు, అతడి నటనలో ఉన్న ప్రత్యేకత గురించి గొప్పగా వివరించారు. రఘువరన్ భార్య రోహిణి ఈ చర్చంతా చూసి ఎమోషనల్ అయింది. ఇది చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని.. తన కొడుక్కి ఇదంతా చూపిస్తానని అంది. 1996లో రఘువరన్‌ను పెళ్లాడిన రోహిణి.. 2004లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఇంకో నాలుగేళ్లకే రఘువరన్ మరణించాడు. వీరికో కొడుకు ఉన్నాడు.

రఘువరన్ చనిపోయాక ఆయన ప్రస్తావన ఎప్పుడు వచ్చినా రోహిణి ఎమోషనల్ అవుతుంటుంది. ఇప్పుడు తన భర్త మీద జనాల్లో ఎంత అభిమానం ఉందో ట్విట్టర్లో చూసేసరికి రోహిణి చాలా ఎమోషనల్ అయినట్లుంది.