'KCR' కు మేనల్లుడి కొత్త అర్థం..

'KCR' కు మేనల్లుడి కొత్త అర్థం..

తాను వదిలిపెట్టి వెళ్లిన సిద్ధిపేట నియోజకవర్గం ఏమవుతుందోనన్న భయం.. బాధ తనకు ఉండేదని.. కానీ.. హరీశ్ కారణంగా అలాంటిదేమీ లేదంటూ వేలాది మంది సాక్షిగా మేనల్లుడ్ని.. మేనమామ కమ్ తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ పొగిడేసిన వైనం తెలిసిందే. అంత మంది ముందు మేనమామ అంతలా పొగిడేస్తే.. ఏ మేనల్లుడి మనసు మాత్రం పులకరించిపోదు. అందుకేనేమో.. మేనమామ పేరుకు కొత్త అర్థాన్ని చెప్పి.. కేసీఆర్ ను అభిమానించే వారందరికి సరికొత్తగా పొగిడేయటానికి అవకాశాన్ని కల్పించారు హరీశ్.

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసిన సందర్భంలో.. సిద్ధిపేట జిల్లాను కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను హరీశ్ పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘KCR’’పేరును ఎవరూ ఆలోచించని రీతిలో ఆలోచించి.. ఆ పేరుకు కొత్త అర్థాన్ని చెప్పి.. టీఆర్ఎస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు.. కేసీఆర్ ను అభిమానించే వారందరిని ఖుషీ చేశారని చెప్పక తప్పదు.

‘‘కేసీఆర్’’ అంటే ‘‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు’’ కాదంటూ.. K అంటే..నాల్డెజ్ అని.. C అంటే.. కమిట్ మెంట్ అని.. R అంటే రీ కన్ స్ట్రక్షన్ (పునర్నిర్మాణం) అని అభివర్ణించి.. తన పేరులో ఉన్నట్లే మూడింటిని తన పాలనతో కేసీఆర్ నిజం చేశారంటూనే తన శిరసు వంచి పాదాభివందనం చేసేసిన హరీశ్.. అందరి మనసు దోచుకున్నారు. ఏమైనా హరీశ్ రేంజ్లో కేసీఆర్ ను పొగడటం అంత తేలికైన ముచ్చట కాదని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు