టీడీపీలో ముద్రగడకు సరిజోడు ఎవరు?

టీడీపీలో ముద్రగడకు సరిజోడు ఎవరు?

కొద్దికాలంగా ఏపీలోని చంద్రబాబ ప్రభుత్వానికి ఏకు మేకులా మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తరచూ దీక్షలు, ధర్నాలతో చంద్రబాబుకు కునుకు పట్టకుండా చేస్తున్నారు. అయితే.. ఆయన్ను పూర్తిస్థాయిలో కంట్రోలు చేయాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదట.  ముద్రగడను ఎదుర్కొనే స్థాయి నేతలు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి సమస్యగా మారిందంటున్నారు.  కాపుకార్పొరేషన్ రుణాలు, ఆ కులానికి చెందిన విద్యార్థులు విదేశాలకు వెళుతున్నా ముద్రగడ చేస్తున్న ప్రచారానికి మెజారిటీ కాపు వర్గం ఆకర్షితులవుతుండడంపై టీడీపీలో ఆందోళన ఉందని సమాచారం.  ముద్రగడ దీక్షకు ముందు తెదేపాకు అనుకూలంగా ఉన్న కాపులలో ఒక పెద్ద వర్గం, ముఖ్యంగా యువకులు పార్టీకి వ్యతిరేకంగా మారుతుండటం తెదేపా నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోందట.. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చైర్మన్‌గా నియమితులైన రామానుజయకు కాపులలో ఇమేజ్ లేకపోవడం, ఆయనకు అన్ని జిల్లాల కాపులతో పరిచయం, పట్టు లేకపోవడం, పెద్దగా వర్గబలం లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి చరిత్రలో తొలిసారిగా కాపులకు కార్పొరేషన్ ఇచ్చిన నేపథ్యంలో దానిని వినియోగించుకుని, ఈపాటికే ముద్రగడకు సమాంతర నేతగా ఎదిగి ఉండాల్సింది. కానీ ఆ విషయంలో ఆయన విఫలమయ్యాయన్న వ్యాఖ్యలు పార్టీవర్గాల్లో వినిపిస్తున్నాయి.

నిజానికి ఆయనకంటే పేరు, పరిచయాలున్న కాపునేతలున్నప్పటికీ వారినెవరినీ పరిగణనలోకి తీసుకోలేదు. చిరంజీవి పీఆర్పీ స్థాపించినప్పుడు మెజారిటీ కాపులు అందులో చేరినప్పటికీ, పార్టీ వెంటే ఉన్న కాపులను నాయకత్వం విస్మరించింది. గుంటూరు జిల్లా సీనియర్ నేత చందు సాంబశివరావు కొనే్నళ్ల నుంచి మీడియా చర్చల్లో పాల్గొంటూ పార్టీ వాణి వినిపిస్తున్నారు. ఆయనకంటే జూనియర్ అయిన వారికి ఎమ్మెల్సీలిచ్చిన నాయకత్వం, చందుకు మాత్రం మొండిచేయి చూపింది. ఈవిధంగా జిల్లాల్లో అనేకమంది సమర్ధులున్నా వారిని విస్మరించిన ఫలితంగా ముద్రగడ ఇతర కాపు నేతలపై ఎదురుదాడి చేసేవారు కరవయిపోయారు. సమర్ధులను పక్కకుపెట్టి, ఎదురుదాడి చేసే ధైర్యం లేనివారికి పదవులివ్వడమే ఈ దుస్థితికి కారణమని విశే్లషిస్తున్నారు.

టీడీపీలో కాపు నేతలెవరూ పబ్లిక్ లో ఛరిష్మా ఉన్నవారు కాకపోవడంతో ముద్రగడకు ధీటుగా నిలవలేకపోతున్నట్లు సమాచారం. హోంమంత్రి చినరాజప్ప వివాదరహితుడు, పార్టీకే కట్టుబడిన వ్యక్తి అయినా కూడా ఆయనకు ముద్రగడను ఎదుర్కొనే స్థాయి, పలుకుబడి లేదు.  గంటా శ్రీనివాస్‌కు మాస్‌లో ఇమేజ్ ఉన్నా  కులపరంగా ఆయనకు ముద్రగడను ఎదుర్కొనే శక్తి, ఇమేజ్ లేదంటున్నారు. అంగబలం, అర్ధబలం ఉన్నా కులంలో బలం లేదని చెబుతున్నారు. ముద్రగడతోపాటు వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన కాపునేతలు సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే గంటా మాత్రం ఆ స్థాయిలో ఎదురుదాడి చేయటంలో విఫలమయ్యారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నారాయణ కూడా మంత్రి అయినా నాయకుడు మాత్రం కాదు. కులంలో కూడా బలం లేదు. ఎన్నికల సమయంలో పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. కానీ ఆయనకు ముద్రగడ ఇమేజ్‌లో పదోవంతు కూడా లేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.  ఇక మంత్రి మృణాళిని సాంకేతికంగా తూర్పు కాపు బిసి అయినప్పటికీ కాపుగానే చెలామణి అవుతున్నారు. ఆమె వల్ల కులానికి ఉపయోగం లేదని, ఎప్పుడూ ముద్రగడపై విరుచుకుపడిన దాఖలాలు లేవని టీడీపీ నేతలే అంటున్నారు.  దీంతో టీడీపీలో ముద్రగడకు సరితూగే కాపు నేతలే కరవయ్యారని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు