ధనుష్ కాదన్నాడు.. ఆమి‌ర్ చేస్తాడా?

క్రికెట్లో చిన్న చిన్న రికార్డులకే, విజయాలకే మనం ఉప్పొంగిపోతుంటాం. క్రికెటర్లను ఆకాశానికెత్తేస్తుంటాం. ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందిన దేశాలు మహా అయితే ఓ 20 ఉంటాయేమో. కానీ చెస్‌ను ప్రపంచమంతా ఆడతారు. ఈ ఆట తెలియని దేశాలు చాలా తక్కువ. ఇలాంటి ఆటలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయి ఔరా అనిపించిన ఘనుడు విశ్వనాథన్ ఆనంద్. ఆటలో ఘనతల్ని ప్రామాణికంగా తీసుకుంటే సచిన్ కంటే ముందు ఆనంద్‌కు భారతరత్న రావాల్సిందేమో. కానీ ఆయన ఆ గౌరవానికి నోచుకోలేదు.

మూడు దశాబ్దాలుగా ప్రపంచ యవనికపై భారత పతకాన్ని రెపరెపలాడిస్తున్న ఈ మేధావి జీవితంలో కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో మలుపులున్నాయి. ఆ మలుపుల్ని వెండితెర మీదికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలైంది. బాలీవుడ్ విలక్షణ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఆనంద్ బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఆనంద్ ఎల్.రాయ్‌కి దక్షిణాదిన ఎంతో ఇష్టమైన నటుడు, ఇప్పటికే ఆయనతో రెండు సినిమాలు చేసిన ధనుష్.. ఆనంద్ పాత్రలో నటిస్తాడని ఇంతకుముందు వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే ఓ భారీ హాలీవుడ్ సినిమాను అంగీకరించడం, చేతిలో వేరే కమిట్మెంట్లు కూడా ఉండటంతో ధనుష్ ఈ సినిమాలో నటించలేకపోతున్నాడట. దీంతో ఆనంద్ పాత్ర కోసం కొత్త నటుడిని వెతికే పనిలో పడ్డారట.

ఐతే ఆషామాషీ నటుడైతే ఈ పాత్రను పండించలేడని భావించి.. ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ను సంప్రదిస్తున్నాడట ఆనంద్. ఇంతకుముందు ‘దంగల్’ లాంటి స్పోర్ట్స్ డ్రామాను అద్భుతంగా పండించాడు ఆమిర్. ఆనంద్ పాత్ర పండాలంటే సటిల్ యాక్టింగ్‌తో దానికి ప్రత్యేకత చేకూర్చే నటుడు కావాలి. ఆమిర్ అలాంటి నటుడే. అతను ఈ పాత్ర చేస్తే సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉ:టుంది కూడా. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాకు ప్రచారం లభిస్తుంది. మరి ఆమిర్ ఈ చిత్రాన్ని ఒప్పుకుని ఆనంద్ బయోపిక్‌కు క్రేజ్ తీసుకొస్తాడేమో చూడాలి.