మేయర్ కు పక్కకు తీసుకెళ్లి మరీ క్లాస్ పీకిన సీఎం కేసీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల్ ఆర్ విజయలక్ష్మి ఎన్నికైన విషయం చాలా పాత విషయం. ఇప్పటికే ఈ విషయం గురించి చాలానే వార్తలు వచ్చాయి. కానీ.. మేయర్ ఎన్నిక.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన చాలా అంశాలు బయటకు రాలేదు. మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ కొత్త మేయర్ కు ‘క్లాస్’ తీసుకున్న విషయం టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

కేకేకు గతంలో మాట ఇచ్చిన సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్లే మేయర్ పదవిని ఆమెకు ఇచ్చారని చెబుతారు. విజయలక్ష్మి ఎంపికను మంత్రి కేటీఆర్ ఇష్టపడలేదన్న మాట టీఆర్ఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదని చెబుతారు. గద్వాల్ విజయలక్ష్మి వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే తత్త్వం ఆమెకు ఎక్కువన్న ఆరోపణ ఉంది. అంతేకాదు.. తాను మాట్లాడే మాటలతో పార్టీకి జరిగే నష్టం గురించి ఆమె పట్టించుకోరన్న విమర్శ ఉంది. దీనికి తోడు అమెరికాలో చాలాకాలం ఉండటం.. ఫ్యామిలీ కౌన్సిలర్ గా వ్యవహరించిన ఆమె.. చాలా విషయాల్ని లైట్ తీసుకుంటారన్న పేరుంది.

అందుకే.. ఆమెకు మేయర్ లాంటి పదవిని అప్పజెబితే.. ఓపెన్ గా మాట్లాడేసే తీరు పార్టీని ఇబ్బందికరంగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగా ఆమె పేరును మేయర్ అభ్యర్థిగా పరిశీలనలోకి వచ్చి.. రెండు, మూడు సార్లు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. అయితే.. కీలక సమయంలో ప్రగతిభవన్ కు నేరుగా వెళ్లిన కేకే.. కేసీఆర్ ను వ్యక్తిగతంగా మాట్లాడటం.. మేయర్ పదవిని తమకు ఇవ్వాల్సిందిగా కోరటం.. గతంలో ఆయనిచ్చిన మాటను పదే పదే ప్రస్తావించటంతో కాదనలేని పరిస్థితుల్లో ఆమెను ఎంపిక చేసినట్లుగా చెబుతారు.

మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసి.. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన మేయర్..డిప్యూటీ మేయర్.. ఇతర కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ ను కలిసేందుకు.. ప్రగతిభవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కొత్త కార్పొరేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన తీరుకు భిన్నంగా వారితో బాగా మాట్లాడటమే కాదు.. ప్రశాంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత.. మేయర్ విజయలక్ష్మిని ప్రత్యేకంగా పిలిపించుకున్న కేసీఆర్.. ఆమెకు ప్రత్యేకంగా క్లాస్ పీకినట్లు సమాచారం.

ఏం తోస్తే.. అది మాట్లాడే తీరు మార్చుకోకపోతే సమస్యలు తప్పవని.. మీడియాతో వీలైనంత తక్కువగా మాట్లాడాలని.. క్లుప్తంగా మాట్లాడటం.. ఇంగ్లిషులో మాట్లాడొద్దని.. సంభాషణ మొత్తం తెలుగులోనే ఉండాలన్న విషయాల్ని పదే పదే చెప్పినట్లుగా తెలుస్తోంది. కీలక పదవిలో ఉన్న నేపథ్యంలో.. చిన్నగా మాట జారినా మీడియాలో జరిగే రచ్చ.. సోషల్ మీడియాలో సాగే ట్రోలింగ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించి.. జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. కేసీఆర్ చెప్పినట్లే విజయలక్ష్మి తన తీరును మార్చుకుంటారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.