రేవంత్ స్కెచ్ అంతుచిక్క‌డం లేదట‌

రేవంత్ స్కెచ్ అంతుచిక్క‌డం లేదట‌

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీతో ఎందుకు అంటిముట్ట‌న‌ట్లు ఉంటున్నారు?

పార్టీ కార్య‌క్ర‌మాల కంటే సొంత ఆస‌క్తుల‌పైనే రేవంత్‌కు మ‌న‌సు ఎందుకు మళ్లింది? తెలంగాణలో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని నిల‌బెట్ట‌డంలో వైఫ‌ల్యం ఎక్క‌డుంది? స‌ంద‌ర్భానుసారం సీనియ‌ర్లు రేవంత్ పై ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఇది తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌

తెలంగాణలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్రం ఏర్పడిన తరువాత వెలవెలబోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో సైతం చివరకు 15 స్థానాల్లో విజయం సాధించినా, ఆ తరువాత పరిణామాలతో పూర్తిగా బలహీనపడింది. టీడీపీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులు సైతం టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో ఇతర పార్టీలో అవకాశాలు లేని వారు, టీఆర్‌ఎస్‌లో ఇమడలేని వారు, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి అవకాశం లేని నాయకులు మాత్రమే టీడీపీలో మిగిలిపోయారనేది కాద‌న‌లేని నిజం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వరకు కనీసం హైదరాబాద్‌లోనైనా పార్టీ బలంగా ఉంటుందని భావించారు. ఫలితాలు వచ్చాక చివరకు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్ బాట పట్టారు. మ‌రోవైపు యువ‌నాయ‌కుడు అని ప‌గ్గాలు అప్ప‌గించిన రేవంత్ రెడ్డి సొంత ఆస‌క్తుల‌పై శ్ర‌ద్ధ పెడుతున్నారు. దీంతో  టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

తెలంగాణలో టీడీపీ పుంజుకునే అవకాశాలు ఏ కోశాన కనిపించడం లేద‌నే రేవంత్‌రెడ్డి ఇటీవల స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల తరుఫున 48 గంటల దీక్షకు రేవంత్ కూర్చున్న సంగ‌తి తెలిసిందే.  సాధారణంగా టీడీపీ చిన్న కరపత్రాన్ని ముద్రించినా, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు తప్పని సరిగా ఉండాలి. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం భారీ కటౌట్లు తయారు చేయించినా, ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. తొలిసారిగా ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు లేకుండా కేవలం తన ఫోటోలతోనే దీక్షకు సంబంధించిన బ్యానర్లు, కటౌట్లు తయారు చేయించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద, మల్లన్నసాగర్ ముంపు దీక్ష శిబిరం వద్ద అన్ని చోట్ల ఇవే ఏర్పాటు చేయించారు. రేవంత్‌రెడ్డి స్వతంత్రంగా వెళ్లడం మిగిలిన నాయకులకు మింగుడుపడ లేదు. అయితే మిగిలిన నాయకులు టీవి చర్చల్లో టిడిపి తరపున మాట్లడడం, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడడం మినహా పార్టీ కార్యక్రమాలు అంటూ చేస్తున్నవేవీ లేవు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి మాత్రం స్వతంత్రంగా ప్రతి అంశంపై తన ధోరణిలో తాను మాట్లాడుతూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు టీడీపీ ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వలేదనే నిర్థారణకు వచ్చిన రేవంత్‌రెడ్డి, బలమైన సామాజిక వర్గాన్ని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏకం చేయడం ద్వారా రాజకీయ భవిష్యత్తును రూపొందించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. తన రాజకీయ వ్యూహానికి టిడిపి ఒక వేదిక మాత్రమే అని గతంలో తరుచుగా చెబుతూ ఉండేవారు. దీనికి అనుగుణంగానే రేవంత్‌రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ టీడీపీ నాయకులంతా తరుచుగా విజయవాడ వెళ్లి పార్టీ వ్యవహారాలపై చంద్రబాబుతో చర్చిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ తెలంగాణ సమీక్ష నిర్వహించినా సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌న్నింటి ద్వారా రేవంత్ త‌న సొంత ఎజెండా ఆధారంగా ముందుకు పోతున్నారా అనే చ‌ర్చ సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు