అందరిలోను పెరిగిపోతున్న టెన్షన్

రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంపై అందరిలోను హై టెన్షన్ పెరిగిపోతోంది. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య మొదలైన పంచాయితి రోజుకో మలుపు తిరుగుతు అందరిలోను తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సోమవారం నుండి పంచాయితి ఎన్నికల నామినేషన్లను తీసుకోవాల్సుంది. అయితే దీనికి 11 జిల్లాలో ఎక్కడా అందుకు తగ్గ ఏర్పాట్లు కాలేదు. ఏ జిల్లాలో కూడా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు.

రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకమే జరగలేదు కాబట్టి దిగువస్ధాయి పోలింగ్ సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు. సుమారు 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాల్సుంది. అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలోను సుమారు 5 మంది సిబ్బంది అవసరం. పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ అధికారి, అసస్టెంట్ పోలిసింగ్ అధికారి, ఎన్నికల గుర్తు వేసే అధికారి, బ్యాలెట్ పేపర్ ను ఇచ్చే సిబ్బందికి తోడు పోలింగ్ కేంద్రం దగ్గర కనీసం నలుగురు పోలీసులు కాపలాగ ఉండాలి.

ఈ లెక్కన సుమారుగా 1.2 లక్షల పోలింగ్ కేంద్రాలంటే ఎన్ని లక్షలమంది పోలింగ్ సిబ్బంది అవసరమో అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో పోటీచేసే అభ్యర్ధులకు నామినేషన్ పత్రాలు ఇవ్వటం, తీసుకోవటం వేరే ప్రక్రియ. అలాటే ప్రతి అభ్యర్ధికి ఓటర్లజాబితాను ఇవ్వాలి. ఇలాంటివి ఏవీ కాకుండానే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనంతట తానుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు.

సోమవారం విచారణలో సుప్రింకోర్టు కానీ లేదా హైకోర్టు కానీ ఎన్నికలను వాయిదా వేస్తే సమస్యుండదు. కానీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితే అప్పుడేమవుతుంది ? అన్న విషయంలోనే టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెబితె వెంటనే ఉద్యోగులు సమ్మెలోకి వెళటానికి రెడెగా ఉన్నారు. ఉద్యోగులు సమ్మెలోకి వెళితే అప్పుడేమవుతుందన్నదే హై ఓల్టేజీ టెన్షన్ గా మారింది. ఒకవేళ సిబ్బంది అందరు సమ్మెలోకి వెళ్ళకపోయినా ఎన్నికలకు ఏర్పాట్లే జరగలేదు. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అంతా గందరగోళంగా ఉంది.