ఎన్నికలు బాయ్ కాట్ చేస్తాం: ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుందని నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరోపక్క, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమంటూ సుప్రీం కోర్టును ఏపీ సర్కార్ ఆశ్రయించింది. మరోవైపు, ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్యోగుల సంఘాలు కూడా ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. పంచాయతీ ఎన్నికలు ఆపాలని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా సిద్ధమని, ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ తీరు బాధాకరమని అన్నారు. కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగులను, ప్రజలను బలితీసుకుందని, కాబట్టి వ్యాక్సినేషన్ అనంతరం ఎన్నికలకు వెళతామని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి విన్నవించామని, అయినా కూడా ఎస్ఈసీ మొండి వైఖరితో ముందుకు వెళుతోందని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణలో తమ ఇబ్బందులను వివరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం నాడు ఈ వ్యవహారం విచారణకు రానుందని అన్నారు. అయితే, ఈ లోపే హడావిడిగా నోటిఫికేషన్ విడుదల చేసిందని, ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్నికల నిర్వహణ అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

రెండున్నరేళ్లుగా ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని, కానీ, హుటాహుటిన ఎన్నికలు నిర్వహించి ఉద్యోగులను చంపమని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. గాజు అద్దాల చాటు నుంచి ఎస్ ఈసీ ప్రెస్ మీట్లో మాట్లాడారని, అలాగే తాము కూడా ఎన్నికల విధులు నిర్వర్తించాలా..? అని ప్రశ్నించారు. తమవిజ్ఞప్తులన్నీ బుట్టదాఖలు చేసి నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారని, దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగాయిని, అందుకే ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఏపీ ఎన్జీవోస్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వ్యవస్థలు బరితెగించాయని, ఏపీ రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.