ట్రంప్.. కొత్త పార్టీ దిశగా అడుగులు

చిన్న బ్రేక్ ఇచ్చా.. త్వరలో మళ్లీ వస్తానంటూ తెలుగు సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం ఉందంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం సంచలన నిర్ణయాలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన అనుసరించిన విధానాలు షాకింగ్ గా మారాయి.

అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు ససేమిరా అన్న ఆయన.. తాజాగా శ్వేతసౌథాన్ని విడిచే క్రమంలోనూ ఆనవాయితీల్ని పక్కన పెట్టేశారు. చివరకు అధ్యక్షుడి హోదాలోనే ఎయిర్ ఫోర్సు వన్ లో వాషింగ్టన్ వీడారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత తాను క్రియాశీలక రాజకీయాల్లో మరోలా ఎంట్రీ ఇస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. మళ్లీ వస్తానని చెప్పిన ఆయన మాటలకు తగ్గట్లే.. చేతలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే సొంత పార్టీని ఏర్పాటు చేయాలన్న యోచనలో ట్రంప్ ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడే కాకున్నా.. సరైన సమయంలో దాన్ని ప్రారంభించాలన్న యోచనలో ఉన్న ఆయన.. దాని పేరు ప్రేట్రియట్ పార్టీగా పేర్కొన్నారు. కేపిటల్ హిల్ భవనంపై దాడి తర్వాత దేశ వ్యాప్తంగా ట్రంప్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ కావటం.. దానిపై రేగిన గొడవ అంతకంతకూ పెరుగోతంది. దీంతో.. తన ఫ్యూచర్ ప్లాన్ నుకాస్త ఆగి షురూ చేయాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

దేశానికి తానెంతో చేశానని.. తిరిగి వైట్ హౌస్ కు తిరిగి వస్తానని చెప్పటం చూస్తే.. ఆయన కొత్త పార్టీ పెడతారన్న వాదనకు బలం చేకూరుతుందంటున్నారు. లక్షల మంది శ్రమించే దేశభక్తులున్నారని.. దేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజకీయ ఉద్యమాన్ని చేపట్టామని.. దానికి ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో ట్రంప్ ఖాళీగా ఉండటం తర్వాత.. ఆయన పుణ్యమా అని ఏదో ఒక లొల్లి ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.