రాజధానిలో సినిమా కష్టాలు చెప్పిన ఏపీ మంత్రి

రాజధానిలో సినిమా కష్టాలు చెప్పిన ఏపీ మంత్రి

సినిమా కష్టాలు ఎలా ఉంటాయో తెలియని వాళ్లకి అవి ఎలా ఉంటాయో వివరిస్తున్నారు ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆరు నూరైనా.. ఈ నెల 27 తర్వాత అమరావతి నుంచే పాలన సాగించాలని సీఎం చంద్రబాబు గీసిన లక్ష్మణరేఖను దాటేందుకు ఎవరూ సాహసించలేదు. దీంతో ఎట్టకేలకు దాదాపు 14 శాఖలు అమరావతికి తరలి వెళ్లాయి. అయితే, ఎలాంటి సౌకర్యమూ లేని అమరావతిలో గతంలోనే అడుగు పెట్టిన తాము నానా తిప్పలు పడ్డామని, సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాలను చూసి తనకున్న డబుల్ బెడ్ రూం ఆయనకు కేటాయించానని మంత్రి దేవినేని సోమవారం అన్నారు. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న ఉద్యోగులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న మంత్రి దేవినేని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారన్నమాట.

ఈ మేరకు తన నీటిపారుదల శాఖ సిబ్బంది అమరావతికి తరలి వచ్చిన క్రమంలో జరిగిన సమావేశంలో ఉమా మీడియాతో ఇష్టాగోష్టీగా మాట్లాడుతూ పలు అంశాలు వివరించారు. ఆయన చెప్పిన అమరావతి సినిమా కష్టాలేంటో చూద్దాం. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర పాలనను సీఎం చంద్రబాబు ఉన్న పళంగా.. విజయవాడ నుంచి మొదలుపెట్టారు. అప్పటికి సీఎంకు అక్కడ క్యాంపు కార్యాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన తనకు ఉన్న రూంను సీఎంకు కేటాయించారట.

ఇంకా ఉమ మాట్లాడుతూ ''రాష్ట్ర విభజన నేపథ్యంలో మనది కాని రాష్ట్రంలో ఉండకూడదని... కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండాలని విజయవాడ వచ్చేశా. నేను అనుకుంటే హైదరాబాదులోనే పెద్ద బంగ్లాలో ఉండవచ్చు. కానీ, ఇక్కడకు వచ్చి రెండు పడక గదుల ఇంటిలో ఉన్నాను. రెండు గదుల కార్యాలయం నుంచే పాలన చేశాను. కార్యాలయం లేక బస్సులోనే ఉంటున్న సీఎంకు నా కార్యాలయాన్ని ఇచ్చాక, నాకు ప్రత్యేకంగా కార్యాలయం కూడా లేకుండా పోయింది. నన్ను కలవడానికి వచ్చే వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక పొద్దున్నే 8 గంటలకే లేచి ఆరు నెలల పాటు పొలం గట్ల వెంబడి తిరిగాను. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఉద్యోగులకు మాత్రం సకల సౌకర్యాలు కల్పించిన తర్వాతే తరలిస్తున్నాం. అనుకున్న విధంగా ఉద్యోగులు వస్తుంటే సందడి వాతావరణం నెలకొంది"" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదన్నమాట రాజధాని అమరావతి కష్టాలు.