నిర్మాతల ఆతృత… నటీనటుల వెనుకంజ!

లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్నారు కానీ కరోనా సమస్య అయితే ఇంకా తీరలేదనేది స్పష్టంగా తెలుసు. షూటింగ్స్ కి కూడా జూన్ నుంచి పర్మిషన్ వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారట. దీంతో నిర్మాతలు ఊరట చెందుతున్నారు. అయితే సినిమా షూటింగ్స్ లో సామజిక దూరం పాటించడం కష్టం.

ముఖ్యంగా నటీనటులు మేకప్ కోసం, ఇతర అవసరాల కోసం వెంట సహాయకులు ఉండాలి. వాళ్ళు వీరిని తాకుతూ ఉంటారు. అలాగే షూటింగ్ లో సాటి నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన సన్నివేశాలుంటాయి. కెమెరా సిబ్బందికి, దర్శకత్వ శాఖకి కూడా సామజిక దూరం పాటించే సౌకర్యం ఉండదు. దీంతో ప్రముఖ నటీనటులు ఇంకా కరోనా బూచి భయం పోకముందే షూటింగ్స్ అంటే జంకుతున్నారట.

అది ఒకరికి సోకితే ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా సమస్యే కనుక ఇరవై మందికి మించి సిబ్బంది అవసరం లేని టీవీ షోస్, చిన్న సినిమాల షూటింగ్స్ మాత్రం మొదలు కావచ్చునని భావిస్తున్నారు. మళ్ళీ తెలుగు సినిమా యధావిధిగా రన్నింగ్ లో పడడానికి మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాలంటున్నారు.