5,394 కోట్ల అద‌న‌పు అప్పు.. జ‌గ‌న్ ఏం చేస్తున్నారంటే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ఇప్పుడు అప్పుల ప్ర‌దేశ్‌గా మారుతోంద‌నే భావ‌న సర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు మ‌రిన్ని అప్పులు చేసుకునేందుకు ప‌రుగులు పెడుతోంది.

మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన ప్ర‌తి అంశాన్నీ అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో కొంద‌రికోసం.. అంద‌రిపైనా.. భారాలు మోపే బ‌హుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్రం అప్పులు తీసుకునేందుకు ఏమాత్రం వెసులు బాటు క‌ల్పించినా.. ఏపీ స‌ర్కారు వెంట‌నే నున్నానంటూ.. త‌లుపు తీస్తోంది. ఢిల్లీ బాస్‌ల ముందు నిల‌బ‌డుతోంది. వారు చెప్పిన సంస్క‌ర‌ణ‌ల‌కు ఓకే చెబుతోంది.

ఇలా కేంద్రం విధించిన నాలుగు సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసేందుకు రాష్ట్రం తెర‌దీసేందుకు రెడీ అయింది. నిజానికి వీటిలో మూడు సంస్క‌ర‌ణ‌ల‌కు ఇప్ప‌టికే ఓకే చెప్ప‌డం ద్వారా రాష్ట్రం రూ.5394 కోట్ల అద‌న‌పు తెచ్చుకునేందుకు సిద్ధ‌మైంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ‌.. తాము సూచించిన సంస్క‌ర‌ణ‌ల‌కు ఓకే చెప్పిన రాష్ట్రాల జాబితా.. ఆయా రాష్ట్రాల‌కు చేకూరే అద‌న‌పు అప్పుల వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను విడుద‌ల చేసింది.

దీంతో ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా ఏపీ చాలా ముందుంది. ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ప‌న్నులు, యూజ‌ర్ చార్జీలు పెంచ‌డం ద్వారా.. ఒక దేశం-ఒకే రేష‌న్ కార్డులో సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డం ద్వారా.. కార్డుల్లో కోత పెట్ట‌డం వంటివి ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది.

ఈ ప‌రంప‌ర‌లో మ‌రో కీలక సంస్క‌ర‌ణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌. దీనిని కూడా ఏపీ స‌ర్కారు అమ‌లు చేస్తోంది. అయితే.. వీటిలో రెండు మాత్రం ప్ర‌జ‌ల‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపిస్తున్నాయి. ప‌ట్ట‌ణాల్లో ప‌న్నులు భారీగా పెరుగుతాయి. అదేవిధంగా తాగునీటి, సీవ‌రేజ్ చార్జీలు కూడా మోత‌మోగ‌నున్నాయి. ఈ ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల‌పై తీవ్ర ఆర్థిక భారం మోప‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ మూడు సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కారుకు.

రూ.5394 కోట్ల మేర‌కు అద‌నంగా అప్పు చేసుకునే అవ‌కాశం ల‌భించినా.. ఒక్క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో అమ‌లు చేస్తున్న సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌పై ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల కోట్ల మేర‌కు భారం ప‌డ‌నుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌(సుల‌భ‌త‌ర వాణిజ్యం)లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం ద్వారా రూ.2595 కోట్లు, ప‌ట్ట‌ణాల్లో ప‌న్నుల మోత ద్వారా రూ.344 కోట్లు, రేష‌న్ కార్డుల విధానంలో సంస్క‌ర‌ణ‌ల ద్వారా.. రూ.2595 కోట్లు అద‌నంగా అప్పులు చేసుకునే అవ‌కాశం జ‌గ‌న్ స‌ర్కారుకు ల‌భించినా.. మున్ముందు ఇది తీవ్ర ఇబ్బంది క‌ర ప‌రిస్తితికి దారితీస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో ఇదేం వ్యూహ‌మో.. జ‌గ‌న్‌కే తెలియాల‌ని పెద‌వి విరుస్తున్నారు. కానీ, ఇదే విష‌యంలో పొరుగు రాష్ట్రాలు చాలా మేర‌కు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.