కేసీఆర్ లెక్క మళ్లీ మారింది

కేసీఆర్ లెక్క మళ్లీ మారింది

రాజ్యసభకు ఎంపికచేసే అభ్యర్థుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కసరత్తుకు తుదిరూపం ఇచ్చినట్లు సమాచారం. తన ఫామ్హౌస్కు చేరుకున్న చంద్రశేఖర్రావు అక్కడి నుంచే పార్టీ ముఖ్యులు కొందరితో ఈ అంశంపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలు కూడా టీఆర్ఎస్కే దక్కనుండటంతో ఇందులో ఒకటి బీసీ సామాజిక వర్గానికి, మరొటి ఓసీలకు కేటాయించాలని ఈ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.

రెండు రాజ్యసభ స్థానాల విషయంలో ఒకటి రెండు రోజుల్లోనే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీనుంచి రాజ్యసభకు వెళ్లిన కేశవరావు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈసారి కూడా మరో స్థానాన్ని బీసీకే ఇచ్చే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఈ అంచనాతో బీసీ నాయకుల నుంచి కేసీఆర్పై పెద్దగా ఒత్తిడి లేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే ప్రత్యేక కేసుగా తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డి శ్రీనివాస్ ఒక్కరే సీఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్నుంచి పార్టీలోకి వచ్చిన సీనియర్ నేతగా, గతంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం, బీసీ సామాజిక వర్గం కోటా కింద డీఎస్కు అవకాశం తప్పకుండా ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి డీఎస్కు స్పష్టమైన హామీ లభించకపోవడంతో చివరిదాకా సస్పెన్స్ తప్పదని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా రాజ్యసభ రెండవ స్థానం కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీఎం కేసీఆర్కు సన్నిహితుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే గతంలో తనకు ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పత్రికాధిపతి సీఎల్ రాజం ముఖ్యమంత్రిని కలిసి కోరినట్టు తెలిసింది. అయితే ఆయనకూ సీఎం నుంచి హామీ లభించలేదని సమాచారం. వీరిద్దరితో పాటు పార్టీ, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చూసే దామోదర్రావు పేరు కూడా రాజ్యసభకు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయని, రాజ్యసభకు కూడా ఎవరూ ఉహించని విధంగా ఎంపిక జరిగినా ఆశ్చర్యం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకోగానే పార్టీ ముఖ్యులు కొందరితో చర్చించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు