కేసీఆర్ తాజాగా చేయించిన సర్వేలో ప్రజలేం చెప్పారంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న అలవాట్లలో తరచూ సర్వేలు చేయించటం ఒకటి. హాట్ టాపిక్ లపై అదే పనిగా సర్వేలు చేయించటం.. అది కూడా ఒకట్రెండు కాకుండా.. వేర్వేరు సంస్థల చేత ఒకేసమయంలో నాలుగైదు చేయించటం.. వారిచ్చిన రిపోర్టులను క్రాస్ చెక్ చేసుకొని.. ఒక ఆలోచనకురావటం తెలిసిందే.

కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ వేళ.. ప్రజల మనసుల్లో ఏముంది? లాక్ డౌన్ ను ఎంతవరకు పొడిగించాలని ప్రజలు కోరుకుంటున్నారు? అందుకున్న కారణాలేమిటి? అన్న అంశాలపై కేసీఆర్ సారు తాజాగా సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

సర్వేలోని అంశాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేయటంలో సర్కారు సక్సెస్ అయ్యిందని.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయటంలో విజయం సాధించినట్లుగా వెల్లడైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కరోనాకు చెక్ చెప్పాలంటే లాక్ డౌన్ ను మరింత కాలం పొడిగించాలన్న మాట ప్రజల మనసుల్లో ఉన్నట్లుగా తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను నెలాఖరు వరకూ పొడిగించాలన్న దానికే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ 3.0 విషయానికి వస్తే.. కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ ను అమలుచేయనుంది. అయితే.. తెలంగాణ ప్రజలు మాత్రం మే చివరి వరకూ లాక్ డౌన్ ను అమలు చేయాలని.. ఆ తర్వాతి పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ లు లేకున్నా.. మరింత కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తేనే మంచిదన్న మాట కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తంగా మూసివేయకుండా.. వైరస్ వ్యాప్తి లేని చోట్ల లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తివేయాలన్న యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ మనసులోనూ.. తెలంగాణ ప్రజల మనసుల్లో లాక్ డౌన్ ను నెలాఖరు వరకు పొడిగించాలన్న మాటే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మే చివరి వరకూ తెలంగాణ లాక్ డౌన్ 3.0 ఉండే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. మరి.. సారు నిర్ణయం ఏముంటుందో చూడాలి.