అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

అన్నదమ్ముల తీరు ఇలాగే ఉంటుంది. తాము అనుకున్నది సాధించుకోవటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు బెదిరింపు రాజకీయాలు చేయటం బాగా అలవాటే. తాము కోరుకున్న పదవులు ఇవ్వకపోయినా లేదా టికెట్లు తమకు కానీ తాము చెప్పినవారికి కానీ దక్కదు అనుకున్న మరుక్షణం నుండే ఇటువంటి బెదిరింపులు మొదలుపెట్టేస్తారు. ఈ విషయాలు గతంలో చాలాసార్లు జరిగాయి. ఇదంతా ఎందుకంటే రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు.

తెలంగాణా కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డిగా చాలా పాపులర్. ఇద్దరిలో ఒకరు ఎంఎల్ఏ ఉంటే మరొకరు ఎంపిగా ఉంటారు. ఇది వీరిద్దరిలో ఉన్న అండర్ స్టాండింగ్ అన్నమాట. ఇంత హఠాత్తుగా తాను బీజేపీలో చేరబోతున్నట్లు రాజగోపాలరెడ్డి ఎందుకు ప్రకటించారు ? ఎవరైనా పార్టీ మారేట్లయితే ముందుగా నోటీసిచ్చి చేరరు. గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరిపోయిన నేతలెవరు మైకు పట్టుకుని ఊరంగా ప్రచారం చేసి, ముందస్తు సమాచారం ఇచ్చి చేరలేదు.

ఎవరితోనో మాట్లాడుకుంటారు ఈక్వేషన్లన్నీ కుదిరితే వెంటనే కండువా మార్చేస్తారని అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు రాజగోపాల రెడ్డి ఎందుకు ఇలా ప్రకటించారు ? ఎందుకంటే తెలంగాణా పీసీసీ అధ్యక్షపదవిని తొందరలో భర్తీ చేయబోతున్నది అధిష్టానం. అధ్యక్షపదవికి వెంకటరెడ్డి తో పాటు రేవంత్ రెడ్డి మరో గట్టి పోటీదారు. వీళ్ళిద్దరిలో రేవంత్ కే అవకాశం ఉందనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే రాజగోపాలరెడ్డి వ్యూహాత్మకంగా ఈ బెదిరింపు ప్రకటన చేసినట్లు అనుమానంగా ఉంది.

రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళిపోతే ఎప్పుడోరోజు వెంకటరెడ్డి కూడా వెళ్ళిపోవటం ఖాయం. ఎందుకంటే తాము ఆశించిన పదవిని అధిష్టానం ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే అవకాశం తక్కువే. తాను బీజేపీలోకి వెళ్ళినా తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని పైకి చెబుతున్నా అదంతా వ్యూహంలో భాగమనే అనుకోవాలి. నిజానికి రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళిపోతారని ఒకసారి లేదు లేదు టీఆర్ఎస్ లోకి వెళతారని మరోసారి చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

కేవలం పదవులను ఆశించే కోటమిరెడ్డి బ్రదర్స్ ఇలాంటి ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలోని నేతలు, క్యాడర్ తోనే కాకుండా నియోజకవర్గంలోని జనాలతో కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటారు వీళ్ళద్దరు. అందుకనే జిల్లాలో సోదరులకు మంచి పట్టుంది. అయితే జిల్లాలో తమకున్న పట్టును అడ్డం పెట్టుకుని తమకు పడని వాళ్ళందరినీ వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారనే ఆరోపణలు కూడా బాగా ఉన్నాయి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్న అసమ్మతి రాజకీయాలు చేసే బ్రదర్స్ లో ఎవరికి పదవి వచ్చినా మిగిలిన వాళ్ళు వ్యతిరేకం చేయకుండా ఉంటారా ? ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టే పార్టీ పరిస్ధితి ఇలా తయారైంది.