టీడీపీలో చేరబోతూనే జగన్ తో కలిసి గవర్నరును కలిశారట

టీడీపీలో చేరబోతూనే జగన్ తో కలిసి గవర్నరును కలిశారట

ఏపీలో రాజకీయ పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ గవర్నరు ముందు ఘొల్లుమన్నారు. తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ఎగరేసుకుపోతున్నారని గోడు వెల్లగక్కారు. ఏపీలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని మొరపెట్టుకున్నారు.. ఏపీలో జోరుగా సాగుతున్న టీడీపీ ఆకర్షకు అడ్డుకట్ట వేసే క్రమంలో ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట సరికొత్త తరహాలో ఆందోళనలకు తెర తీసిన జగన్... కొద్దిసేపటి క్రితం తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాదులోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.  గవర్నరును కలవడానికి తన నివాసం లోటస్ పాండ్ నుంచి ఆయన పార్టీనేతలు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వచ్చి గవర్నరును కలిశారు.

గవర్నరును కలిసిన తరువాత జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 నుంచి 30 కోట్లిస్తూ టీడీపీలోకి లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో ప్రభుత్వ పెద్దలు పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు బినామీల పేరిట పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం కొంతమంది కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుస్తోందన్నారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు.

అయితే.. గవర్నరును కలవడానికి జగన్ వెంట వెళ్లినవారిలో ఎవరెవరు చివరి వరకు జగన్ తో ఉంటారు.. ఎవరెవరు త్వరలో టీడీపీలో చేరుతారన్న చర్చ జరుగుతోంది. త్వరలో 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని జరుగుతున్న భారీ ప్రచారం నేపథ్యంలో ఈ చర్చకు అవకాశమేర్పడింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా గవర్నరుకు ఫిర్యాదు చేయడానికి జగన్ తో పాటు వెళ్లినవారిలోనూ కొందరు త్వరలోనే టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.