టార్గెట్ చంద్రబాబు వయా తెలంగాణా?

 టార్గెట్ చంద్రబాబు వయా తెలంగాణా?

ఉన్నట్లుండి కాంగ్రెస్ తెలంగాణా ఫైలు దుమ్ము దులపడం వెనుక, చంద్రబాబు చరిష్మాకు అడ్డుకట్ట వేయడం అన్న ఏకైక లక్ష్యం దాగివుందా?  ఈ వ్యూహ రచన వైనం అంతా తెలంగాణా రాష్ట్ర సమితికి ముందే తెలుసా? రాజకీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ ఆదేశానుసారం నిర్వహించిన ఓ పకడ్బందీ ప్రయివేటు సర్వేలో, కాంగ్రెస్ డొల్లతనం పూర్తిగా వెల్లడైంది. సీమాంధ్రలో తెలుగుదేశం, వైకాపాల ప్రతిష్ట విషయంలో జనం అభిప్రాయాలు మారుతున్న వైనం బయటపడింది. పాలనా విధానాలతో విసిగిన ప్రజలు, గుడ్డి కంటే మెల్ల మేలు అనుకునే స్థితికి వస్తున్నారని స్పష్టమయింది. రాహుల్ దూతలుగా రాష్ట్రంలో పర్యటించిన కొందరు నాయకులు కూడా ఇదే తరహా  నివేదికను అందించారని తెలిసింది.
ప్రధాని పదవి లక్ష్యంగా సాగుతున్న రాహుల్ రాజకీయం దీంతో కలవరపాటుకు గురయ్యింది. సరియైన నిర్ణయం తీసుకోకుంటే, రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు ఎంపీలు దక్కేది కష్టమని అర్థమయింది. నిజానికి ముందుగా చేసిన సర్వేను అంతగా విశ్వాసంలోకి తీసుకోకున్నా, తన మనుషులు అందించిన నివేదిక కూడా అదే విషయం వెల్లడించడంతో రాహుల్ షురూ కాక తప్పలేదు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు ఈ రెండు వ్యవహారాలను ధృవీకరించాయి. దీంతో రాహుల్ దిగ్విజయ్ ను ఆఘమేఘాల మీద రంగంలోకి దింపారు. తెలంగాణా దిశగా మొత్తం వ్యవహారం నిర్వహించే బాధ్యతను పూర్తిగా ఆయన దిగ్విజయ్ కు అప్పగించేసారు. అందుకు కావాల్సిన టైమ్ టేబుల్ విషయంలో దిగ్గు రాజా కు రాహుల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో ఆయన ఇక రెచ్చిపోయారు.

తెలంగాణాలో విలీనం షరతుపై కెసిఆర్ ను దగ్గరకు తీసకుంటే మెజారిటీ స్థానాలు సంపాదించవచ్చని ఫథకం రచించారు. కానీ ఆంధ్రలో పరిస్థితి ఏమిటి అన్నపుడు ఆయనకు మంత్రి చిరంజీవి అభయం ఇచ్చినట్లు తెలిసింది. ఎంత బదనామ్ అయినా ఒక(తన) వర్గం ఓట్లు 'దేశం'వైపు వెళ్లవని, జగన్ జైల్లో వున్నంత వరకు వైకాపాకు భవిష్యత్ లేదని, అందువల్ల ఆరు నెలల సమయం వున్నందున భయం లేదని నమ్మబలికారు. రాయలసీమలో వైకాపా, ఆంధ్రలో తన వర్గం కలసి 'దేశా'న్ని కట్టడి చేస్తే, మరిక తెలుగుదేశ కనుమరుగైపోతుందనన్నది వారి వ్యూహం. కానీ అక్కడే చిన్న తిరకాసు జరిగింది. కేంద్రంలో వున్న జగన్ లేదా కేవిపి అనుకూల అధిష్టాన నాయకులు జరుగుతున్న వ్యవహారాన్ని ఎవరెవరికి చెప్పాలో వారికి చేప్పేసారు. దీంతో ముందుగానే ఉప్పు అందడంతో హటాత్తుగా వైకాపా వ్యూహం మార్చుకుంది. కేంద్ర కాంగ్రెస్ వ్యూహం కచ్చితంగా తెలియడంతో, తెలంగాణాలో పార్టీ గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని జగన్ నిర్ణయానికి వచ్చేసారు. తన బలాన్నంతటినీ సమైక్య ఉద్యమ దిశగా నడిపించారు. ఇదీ కాంగ్రెస్ కు కలిసే వచ్చింది.

ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఇరుకున పడిపోయారు. ఆయనకు ఏం చేయాలో తోచడం లేదు. వైఎస్, వైకాపా తెలంగాణా బంధాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా, జనం ఉద్యమ వేడిలోపట్టించుకోవడం లేదు. పైగా బాబు పార్టీ తెలంగాణా నేతలు కూడా సైలెంట్ గా వుండడం లేదు. వారు తమ తమ రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నారు. బాబు తెలంగాణా వాదే అంటూ యర్రబిల్లి దయాకరరావు లాంటి వారు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు తెలుగుదేశం ఆంధ్ర నాయకులు సైలెంట్ గా వున్నట్లే, ఇప్పుడు తెలంగాణా దేశం నాయకులు కాస్త సైలెంట్ గా వుంటే బాగుండేది. కానీ అలా జరగడం లేదు.  వైఎస్ చౌదరి, అశోక్ గజపతి తదితరులు రాజీనామా చేసిన తరువాత కూడా బాబు తెలంగాణావాదే అని ఎలా చెబుతారు?
మొత్తం మీద చంద్రబాబును ఇరుకున పెట్టాలనే తెలంగాణా ఇవ్వడం అంటే రాజకీయ లక్ష్యంతోనే అన్నది సుస్పష్టం. ఈ సంగతి స్పష్టమైనందున ఇక సీమాంధ్ర ఉద్యమం మరింత బలోపేతం దిశగా అడుగులువేయడం మినహా చంద్రబాబు ఆలోచించాల్సింది లేదు. ఎందుకంటే, తెలంగాణా ఇచ్చినా, ఇవ్వకున్నా ఆ ప్రాంతంలో ఇప్పట్లో తెలుగుదేశం సాధించేది పెద్దగా వుండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు