అప్పుడు నారా దేవాన్ష్ కాలనీ.. ఇప్పుడు వైఎస్ జగన్మోహనపురం


ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాన్ని నడిపే నేతలు జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నట్లుగా ప్రతి పథకానికీ తమతో తమ కుటుంబీకులు, తమ పార్టీ నేతల పేర్లు పెట్టేయడం పట్ల ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒరవడికి ప్రధానంగా తెరతీసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా పథకాలతో పాటు అన్నింటికీ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ ఒరవడిని తర్వాత వచ్చిన వాళ్లూ కొనసాగించారు.

ఈ మధ్య ఒక అడుగు వేసి పరిపాలిస్తున్న వాళ్లే పథకాలకు తమ పేర్లు పెట్టుకునే సంప్రదాయం కూడా మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంల ో కొన్ని పథకాలకు చంద్రబాబు పేరే పెట్టేశారు. ‘చంద్రన్న కానుక’ తరహాలో కొన్ని పేర్లతో పథకాలు అందించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఈ విషయంలో హద్దులేమీ ఉండట్లేదు.

దాదాపుగా ప్రతి పథకానికీ వెనుక జగన్ పేరు కనిపిస్తోంది. జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న ఆసరా.. ఇలా ప్రతి పథకంలోనూ జగన్ పేరు కనిపిస్తోంది. ఈ విషయంలో జగన్ ఏమాత్రం నియంత్రణ పాటించడం లేదు. ఆయనే అలా ఉంటే కింది స్థాయి నాయకులు ఇంకేం ఆగుతారు. తాజాగా ఏపీలో ఒక చోట ‘వైఎస్ జగన్మోహనపురం’ పేరుతో కొత్త కాలనీ ఏర్పాటవుతుండటం విశేషం. కాకినాడలో పేదలకు ఒక ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఈ ప్రాంతానికి ముందు ఒక ఆర్చి కట్టి దానికి వైఎస్ జగన్మోహనపురం అని పేరు పెట్టడం గమనార్హం. సంబంధిత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీని మీద తెలుగుదేశం వాళ్లు ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతుండగా.. దానికి కౌంటర్‌గా తెలుగుదేశం హయాంలో ‘నారా దేవాన్ష్ కాలనీ’ అంటూ ఓ కాలనీకి పేరు పెట్టిన ఫొటోను వైకాపా వాళ్లు తెరమీదికి తెచ్చారు. ఐతే కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు గ్రామాన్ని అప్పట్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకుని ఆ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అందుకుగాను ఆ కాలనీవాళ్లు ‘నారా దేవాన్ష్ కాలనీ’ అనే పేరుకు అంగీకరించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్న ప్రాంతానికి ‘వైఎస్ జగన్మోహనపురం’ అని పేరు పెట్టడం విడ్డూరమంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.