మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇఫ్పటికే ప్రభుత్వం కోర్టులో ఇదే విషయమై కేసు కూడా వేసిన కారణంగా ఎలక్షన్ కమీషన్ కు కౌంటర్ల వేయమని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా అదనపు అఫిడవిట్ వేయటం గమనార్హం. జనవరి-ఫిబ్రవరి నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జనాలందరికీ కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో పోలీసులు, రెవిన్యు సిబ్బంది సేవలు ప్రభుత్వానికి చాలా అవసరమన్న విషయాన్ని గుర్తుచేసింది.

ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ చేస్తున్న ఏర్పాట్లను కూడా ప్రస్తావించింది. వ్యాక్సిన్ వేయటంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగమంతా బిజీగా ఉంటారు కాబట్టి ఎన్నికల నిర్వహణలో పార్టిసిపేట్ చేయటం ఎవరికీ కుదరదని తేల్చి చెప్పేసింది. అదనపు అఫిడవిట్ వివరాలు తీసుకున్న కోర్టు ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు చెప్పి అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. అలాగే తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మొత్తానికి తాను రిటైర్ అయ్యేలోగా ఎలాగైనా ఎన్నికలను పూర్తి చేయాలన్న నిమ్మగడ్డ పంతం నెరవేరేట్లు కనబటం లేదు.