వైసీపీని గెలిపించే బాధ్య‌త.. ఆ మంత్రుల‌దేనా?

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక వ్య‌వ‌హారం వైసీపీలో కాక రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌రిగిన ఏ ఎన్నిక‌ల‌ను గ‌మ‌నించినా.. అక్క‌డ వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ను స్వ‌యంగా పార్టీ అధినేతగా జ‌గ‌నే చూసుకునేవారు. సార్వ‌త్రిక స‌మ‌ర‌మైనా.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌లైనా(చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన‌), ఆఖ‌రుకు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికైనా.. స్వ‌యంగా జ‌గ‌నే బ‌రిలోకి దిగి త‌న అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేసుకునేవారు. గెలిచారా.. ఓడారా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఎన్నిక‌ల విష‌యంలో మిగిలిన నాయ‌కులు పెద్ద భారంగా ఫీల‌వ‌య్యేవారు మాత్రం కాదు. అంతా అధినేత చూసుకుంటున్నార‌ని అనుకునేవారు.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. వైసీపీ అధినేత సీఎం స్థానంలో ఉన్నారు. దీంతో ఉప ఎన్నిక‌ల వంటి వాటిలో ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో జోక్యం చేసుకునే అవ‌కాశం లేదు. ఏదైనాఉంటే.. నాలుగు గోడ‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో పార్టీని న‌డిపించే బాధ్య‌త‌, గెలిపించే బాధ్య‌త ఇప్పుడు పార్టీలోని కీల‌క నేత‌ల‌పైనే ప‌డింది. తాజాగా ఇదే విష‌యం వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీ సింది. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక షెడ్యూల్ రానుంది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేయాలంటూ.. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర అధికారుల‌కు స‌మాచారం వ‌చ్చింది. దీంతో జిల్లా అధికారులు తిరుప‌తి ఉప పోరుకు సంబంధించిన ఓట‌ర్ల జాబితాను రెడీ చేస్తున్నారు.

అంటే.. మ‌రో నాలుగు వారాల్లోనే తిరుప‌తి బైపోల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తుంది. దీంతో వైసీపీని ఇక్క‌డ గెలిపించే బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకుంటారు? అనే విష‌యం పార్టీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. సాధార‌ణంగా.. అయితే.. ఎవ‌రైనా ముందుకు వ‌చ్చేవారు. అభ్య‌ర్థిని గెలిపించ‌డం ద్వారా.. మార్కులు కొట్టేసేందుకు ప్ర‌య‌త్నం చేసేవారు. కానీ, ఇప్పుడు క్లిష్ట‌మైన ప‌రిస్థితి రాష్ట్రంలో నెల‌కొంది. రాజ‌ధాని అమ‌రావ‌తి ర‌ద్దు, మూడు ముద్దు.. అన్న నినాదంపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో.. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డి కాలేదు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు.. దీనినే అజెండాగా తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు.. తిరుప‌తి ఉప పోరు బాధ్య‌త‌లు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.

అయితే.. ప్రాథ‌మికంగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. ఒక ఎంపీ, ఇద్ద‌రు మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ తిరుప‌తి లో వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని అంటున్నారు. వీరిలో గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేశ్‌, చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూల‌పు సురేశ్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. వీరు ముగ్గురూ భిన్న‌మైన వ్యూహాల‌తో గెలుపు గుర్రాలు ఎక్కిన నాయ‌కులు కావ‌డం.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీ, మంత్రి ఉండ‌డం గ‌మ‌నార్హం.

పైగా పెద్దిరెడ్డి వంటి కీల‌క సీనియ‌ర్ నాయ‌కుడు కూడా ఉండ‌డంతో ఆస‌క్తిగానే ఉన్నా.. రాజ‌ధాని విష‌యం, అభివృద్ధి ప‌డ‌కేయ‌డం, తిరుమ‌ల‌పై వ‌స్తున్న వివాదాలు.. వంటివాటికి స‌మాధానం ఎలా చెబుతారో.. చూడాల‌ని వైసీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, సీఎం జ‌గ‌న్ నేరుగా ప్ర‌చారానికి దిగే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ గెలుపు మంత్రం ఎలా ప‌ఠిస్తుందో చూడాలి అంటున్నారు ప‌రిశీలకులు.