తిరుపతిలో మూడు పార్టీల్లోను విచిత్ర పరిస్దితులేనా ?

అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి మూడు పార్టీల్లోను విచిత్రమైన పరిస్దితులే రాజ్యమేలుతున్నాయి. బీజేపీ, టడీపీ, వైసీపీల్లో ఏమి జరుగుతోందో అర్ధంకాక కొందరు జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అభ్యర్ధిని ప్రకటించకుండానే హడావుడి చేసేస్తున్న పార్టీ ఒకటి. అభ్యర్ధిని ప్రకటించినా ప్రచారానికి దిగని పార్టీ మరోటి. ఇక అంతర్గతంగా డిసైడ్ అయినా అధికారికంగా ప్రకటించని పార్టీ ఇంకోటి. మూడు ప్రధాన పార్టీల వ్యవహారమే ఇలాగుంటే ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి ఆలోచించే జనాలు ఎక్కడున్నారు ?

ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక విషయంలో అందరికన్నా స్పదించేసింది బీజేపీనే. బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించేశారు. తర్వాత పార్టీపరంగా నానా హడావుడి చేసినా ఇంతవరకు అభ్యర్ధి ఎవరున్నది తేలలేదు. మధ్యలో పోటీ చేయబోయేది బీజేపీ అభ్యర్ధా లేకపోతే జనసేన అభ్యర్ధా ? అన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే తిరుపతిలో జరిగిన రెండురోజుల కార్యవర్గ సమావేశంలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు వీర్రాజు క్లారిటి ఇచ్చేశారు. అయితే అభ్యర్ధి ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

ఇక తన సహజ లక్షణానికి భిన్నంగా నెలల ముందే అభ్యర్ధిని ప్రకటించేశారు చంద్రబాబునాయుడు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పనబాక లక్ష్మే రాబోయే ఉపఎన్నికలో టీడీపీ తరపున పోటీ చేస్తుందని చెప్పేశారు. చంద్రబాబు ప్రకటించారు కానీ ఇంతవరకు పనబాక నుండి బహిరంగంగా ఇంతవరకు ఒక్క స్పందన కూడా లేదు. దాంతో ఆమె పోటీ చేసే విషయమై కొందరు నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. లోక్ సభ నియోజకవర్గంలోని కొందరు సీనియర్లకు పనబాక ఫోన్లో మాట్లాడుతున్నా ఇంకా చాలామంది నేతల్లో అయితే ఆమె పోటీచేసే విషయంలో అనుమానాలున్న మాట వాస్తవం.

చివరగా చెప్పుకోవాల్సింది అధికార వైసీపీ గురించే. సానుభూతి కోసమని చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకిరిని పోటీలోకి దింపటం అందరు చూస్తున్నదే. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబం నుండి కాకుండా కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారు. పాదయాత్రలో తనవెంటే నిలిచిన ఫిజియోథెరపిస్టు డాక్టర్ గురుమూర్తిని పోటీ చేయించనున్నట్లు లోక్ సభ పరిధిలోని మంత్రులు, ఎంఎల్ఏల సమావేశంలో చెప్పారట.

గురుమూర్తిని రంగంలోకి దింపబోతున్నట్లు జగన్ చెప్పి కూడా సుమారు మూడు వారాలైపోయింది. అయితే ఇంత వరకు బహిరంగంగా ప్రకటనైతే చేయలేదు. ఈ విషయంలోనే వైసీపీ నేతల్లో అయోమయం కనబడుతోంది. గురుమూర్తిని పోటీ చేయించాలని స్వయంగా జగనే డిసైడ్ అయిపోయినపుడు ఇదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు ? అన్నదే ఎవరికీ అర్ధంకాలేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాల తరపున పోటీ చేస్తారని కూడా ఎవరు అనుకోవటం లేదు. ఒకవేళ పోటీలో ఉన్నా పట్టించుకునే వాళ్ళెవరుంటారు ?