ప‌వ‌న్ అభిమానుల ఒళ్లు మండించేసిన బీజేపీ

ప‌వ‌న్ అభిమానులు భ‌య‌ప‌డిందే జ‌రిగేట్లుంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు గండి కొట్టిన బీజేపీ.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ ఆ పార్టీకి మొండి చేయి చూపించేట్లే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన ఒక్క రోజుకే ఆయ‌న పార్టీని ఎన్నిక‌ల బ‌రి నుంచి ఉప‌సంహ‌రింప‌జేయ‌డం, ఆ త‌ర్వాత జ‌న‌సేన‌తో త‌మ‌కు పొత్తు లేద‌ని ఆ పార్టీ నేత మాట్లాడ‌టం ప‌వ‌న్ అభిమానుల‌ను ఎంత‌గా బాధించిందో తెలిసిందే.

ఐతే పెద్ద‌గా బ‌లం లేని జీహెచ్ఎంసీ ప‌రిధిలో జ‌రిగిన ఎన్నిక‌లు కాబ‌ట్టి వాళ్లు కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కానీ బీజేపీతో పోలిస్తే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తిరుప‌తిలోనూ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌కు అవ‌కాశం లేకుండా చేస్తుండ‌టం మాత్రం ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు త‌ట్టుకోలేని విష‌య‌మే. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థే పోటీ చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు అత్యుత్సాహంతో ప్ర‌క‌ట‌న చేయ‌డం ఇప్పుడు వివాదం రేపుతోంది.

కొద్దిరోజుల కిందట ఢిల్లీ వెళ్లిన పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చ‌ర్చించిన అనంత‌రం తిరుపతి ఎన్నికలో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌య‌మై ఇరు పార్టీల త‌ర‌ఫున‌ ఓ కమిటీ వేసి.. కమిటీలో ఏకాభిప్రాయం సాధించి, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. అభ్యర్థి బీజేపీ నుంచా లేక జనసేన నుంచా అనేది కమిటీ నిర్ణయిస్తుందని ప‌వ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ క‌మిటీ ఏం చ‌ర్చించిందో, ఏం నిర్ణ‌యించిందో తెలియ‌దు. ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న అంటూ ఏమీ లేదు.

ఈలోపే తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేస్తార‌ని సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం జ‌న‌సేన‌ను, ప‌వ‌న్‌ను అవ‌మానించేదే. గ‌త ఏడాది తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌లో నోటా కంటే త‌క్కువ‌గా కేవ‌లం 1.23 శాతం (18 వేల లోపే) ఓట్లు సాధించింది బీజేపీ. అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి పోటీలో లేరు. మొత్తంగా ఏపీలో బీజేపీకి వ‌చ్చిన ఓట్ల శాతం 1 ప‌ర్సంట్ కూడా లేదు. జ‌న‌సేన‌కు దాదాపు 7 శాతం ఓట్లొచ్చాయి. తిరుప‌తిలో ప‌వ‌న్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి చోట త‌మ పార్టీ అభ్య‌ర్థి పోటీలో ఉంటాడ‌ని ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌వ‌న్ అభిమానుల‌కు ఒళ్లు మండిస్తోంది.