బీజేపీ ఒత్తిడికి లొంగిపోయిన పవన్

మరోసారి జనసేన అధినేత బీజేపీ ఒత్తిడికి లొంగిపోయినట్లే అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. శనివారం తిరుపతిలో మొదలైన రెండురోజుల పార్టీ కార్యవర్గ సమావేశాల్లో వీర్రాజు మాట్లాడుతు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారంటు చేసిన ప్రకటన ఒక్కసారిగా సంచలనమైంది.

తిరుపతిలో మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేయబోయేది కమలంపార్టీ నేతే అనేది అందరు అనుకుంటున్నదే. రెండు నెలల నుండి ఇదే విషయాన్ని వీర్రాజు పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే మధ్యలో పవన్ బెట్టుచేయటంతో వీర్రాజు తన ప్రకటనలకు విరామం ఇచ్చారు. ఇంతలో తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికల నోటిఫికేషన్ రావటంతో అందరి దృష్టి దానిపై పడింది. అక్కడ అనూహ్యంగా బీజేపీ గెలవటంతో పార్టీలో ఒక్కసారిగా ఊపు వచ్చేసింది.

ఈ వేడి చల్లారకముందే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రావటం తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిందే. గ్రేటర్ లో కూడా ఊహించని విధంగా ఏకంగా 48 డివిజన్లలో గెలవటంతో బీజేపీని పట్టుకోవటం కష్టమైపోయింది. ఈ నేపధ్యంలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఎట్టి పరిస్దితి జనసేనకు ఇవ్వదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందరు అనుకున్నట్లుగానే పవన్ పై కమలంపార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల బలాబలాలపై పవన్ కు బీజేపీ పెద్ద ప్రజంటేషనే ఇచ్చింది. ఇదే సమయంలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కూడా వాస్తవాలను గ్రహించారు. ఇక లాభం లేదనుకుని తిరుపతిలో పోటీ చేసే విషయమై బీజేపీకి త్యాగం చేసేసినట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని వీర్రాజు ప్రకటించారంటే ఈ విషయం పవన్ తో చర్చించకుండా బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు.

సో తెరవెనుక జరిగింది చూస్తుంటే బీజేపీ ఒత్తిడికి పవన్ మరోసారి లొంగిపోయినట్లే అర్ధమైపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున అభ్యర్ధులను ప్రకటించిన పవన్ తర్వాత కమలం ఒత్తిడికి లొంగిపోయి పోటీనుండే విత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. పోటీనుండి విత్ డ్రా అయినా ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు ముందు ప్రకటించారు. పోటీ నుండి జనసేన అభ్యర్ధులు విత్ డ్రా అయిపోయిన తర్వాత చివరకు ప్రచారానికి కూడా వద్దని చెప్పి దూరంగా పెట్టేశారు. మొత్తానికి ఎక్కడికక్కడ పవన్ పై మైండ్ గేమ్ ఆడటం, ఒత్తిడి పెట్టడం తనకు అనుకూలంగా మలుచుకోవటంలో బీజేపీ నేతలు సక్సెస్ అవుతున్నారు.