టాప్ జర్నలిస్ట్ గాలి తీసేసిన బీజేపీ లీడర్

ప్రముఖ జాతీయ ఛానెళ్లతో పాటు వాటిని లీడ్ చేసే జర్నలిస్టులు సైతం పొలిటికల్ అజెండాతో పని చేస్తారన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. రిపబ్లిక్ టీవీని నడిపించే అర్నాబ్ గోస్వామి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే టీవీ ఛానెల్‌కు ముఖచిత్రంగా ఉంటున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ ముందు నుంచి కాంగ్రెస్ మద్దతుదారుగానే ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే ఛానెళ్లలోనే పని చేస్తుంటాడు కూడా.

మరీ ఓపెన్‌గా కాంగ్రెస్‌ను వెనకేసుకురావడం, బీజేపీని విమర్శించడం చేయడు కానీ.. పరోక్షంగా ఆయనీ ఈ రకంగా వ్యవహరిస్తుంటాడని అందరికీ తెలుసు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వ్యవసాయ బిల్లులపై చర్చా కార్యక్రమాల ద్వారా మోడీ సర్కారును రాజ్‌దీప్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలోనూ ఆయన ఈ అంశంపై చర్చ నిర్వహించారు.

కానీ ఆ చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడొకరు రాజ్‌దీప్‌కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి కల్పించాడు. లైవ్ డిస్కషన్లో భాగంగా వ్యవసాయ బిల్లుల గురించి రాజ్‌దీప్ విమర్శలు గుప్పిస్తూ ఉండగా.. ఉన్నట్లుండి ఆ నేత రాజ్‌దీప్‌కు ఒక ప్రశ్న వేశాడు. మీరు అభ్యంతరకరమైనవిగా చెబుతున్న ఆ మూడు వ్యవసాయ బిల్లుల పేర్లేంటో, వాటి వివరాలేంటో ఒకసారి చెప్పండి అని అడిగాడు. దానికి రాజ‌్‌దీప్ దగ్గర సమాధానం లేదు. ఒక సీనియర్ జర్నలిస్టుగా కనీసం ఈ వ్యవసాయ బిల్లుల పేర్లు కూడా చెప్పలేని మీరు.. చర్చ ఏం చేపడతారు అని ఆ నాయకుడు రాజ్‌దీప్‌ను ప్రశ్నించగా.. ఆయనకు ఏమీ పాలు పోలేదు.

ఓవైపు నీళ్లు నములుతూనే.. తన ముందున్న ట్యాబ్లెట్ మీద గూగుల్ చేసి బిల్లుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు రాజ్‌దీప్. ఆయన్ని ప్రశ్నించిన నాయకుడు ఆ విషయాన్ని పసిగట్టి.. బిల్లుల పేర్లడిగితే గూగుల్ చేస్తున్నారా అని ఎద్దేవా చేశాడు. తర్వాత రాజ్‌దీప్ కొంచెం తేరుకుని ఈ షోలో నేను ప్రశ్నలేయాలి, మీరు సమాధానం చెప్పాలి అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయగా.. మీరేమైనా డిక్టేటరా అంటూ రాజ్‌దీప్‌ గాలి మరింతగా తీసేశాడు ఆ బీజేపీ నేత.