మొత్తానికి రంగంలోకి దిగిన పనబాక..చంద్రబాబుకు రిలీఫ్

ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనాలను కూడా కన్ఫ్యూజ్ లోకి నెట్టేసిన పనబాక లక్ష్మి మొత్తానికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన గెలుపుకోసం పనిచేయాలంటూ కొందరు సీనియర్ నేతలకు ఫోన్లో మాట్లాడారు. తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ముందుగా ఈ ఎన్నిక విషయంలో బీజేపీ హడావుడి మొదలుపెట్టింది. అయితే తన సహజత్వానికి భిన్నంగా చంద్రబాబు ఏకంగా అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించేశారు.

ప్రకటనైతే వచ్చేసింది కానీ పనబాక నుండి ఎటువంటి స్పందనా కనబడలేదు. దాంతో అందరిలోను అమోయమం మొదలైపోయింది. ముందుగానే అభ్యర్ధిని ప్రకటించేసిన చంద్రబాబులో కూడా టెన్షన్ పెరిగిపోయింది. పోటీకి పనబాక వెనకాడుతున్నారని, అసలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు బాగా ప్రచారం జరిగింది. దాంతో ముందుగానే అభ్యర్ధిగా పనబాక పేరు ప్రకటించి తప్పు చేశానా అని చంద్రబాబులో కూడా టెన్షన్ పెరిగిపోయింది. అందుకనే వెంటనే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో రాయబారానికి పంపారు.

సరే సోమిరెడ్డితో అన్నీ విషయాలను స్పష్టంగా మాట్లాడిన తర్వాతే పనబాక దంపతులు చంద్రబాబును కూడా కలిశారు. తర్వాత కూడా ఎక్కడా పనబాక ఊసే లేకపోవటంతో మళ్ళీ పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీ సినియర్ నేతల్లో కొందరికి పనబాకే స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. జనవరి 6వ తేదీన తన కూతురు వివాహం ఉన్న కారణంగా ఇపుడు తాను ఎన్నికలపై దృష్టి పెట్టలేకపోతున్నట్లు చెప్పారట. తన గెలుపుకు అందరు సహకరించాలని కూడా కోరినట్లు చెబుతున్నారు.

తన కూతురు వివాహం అయిపోగానే నేరుగా ప్రచారం మొదలుపెట్టేస్తానని అప్పటి వరకు పార్టీ అభ్యర్ధిగా తనకు ప్రచారం చేయాలని తిరుపతిలోని కొందరు సినియర్లకు స్వయంగా పనబాక ఫోన్లో అభ్యర్ధించారట. తాజా డెవలప్మెంట్ ను బట్టి చూస్తే తిరుపతిలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయటానికి పనబాక ఫిక్సయినట్లే అర్ధమవుతోంది. జనవరి 6వ తేదీ తర్వాత ప్రచారం మొదలుపెట్టేస్తానని కూడా చెబుతున్నారు. అంటే ఇఫుడు నేరుగా ప్రచారం పేరుతో జనాల్లోకి రాలేకపోతున్నా పార్టీ నేతలతో అయితే మాట్లాడుతున్నారు కాబట్టి ఓ రకంగా ప్రచారం మొదలుపెట్టేసినట్లే అనుకోవాలి.

అయితే ఇక్కడ ఓ సమస్యుంది. మార్చిలోగా ఎన్నికలు జరగాలి. మరి పనబాకేమో జనవరి మొదటివారం తర్వాత కానీ ప్రచారంలోకి రానని చెబుతున్నారు. ఈలోగా నేతలనే తన తరపున ప్రచారం చేయాలని రిక్వెస్టు చేస్తున్నారు. అభ్యర్ధి లేకుండా ప్రచారం చేయాలంటే నేతలకు మాత్రం ఎందుకు ఇంట్రస్టుంటుంది ? అందుకనే పనబాక ఫోన్ చేసిన వాళ్ళలో చాలామంది కరోనా వైరస్ సమస్య తగ్గగానే తాము ప్రచారంలోకి దిగుతామని బదులిచ్చారట. అంటే కరోనా వైరస్ సమస్య తగ్గేదెప్పుడు, నేతలు ప్రచారంలోకి దిగేదెప్పుడు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.