తిరుప‌తిలో బీజేపీ-ప‌వ‌న్‌ల స‌త్తా ఎంత‌?

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ ఇంకా రాక‌పోయినా.. పార్టీలు తమ‌ అభ్య‌ర్థుల విష‌యంలో ముమ్మ‌ర క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. ముఖ్యంగా బీజేపీ-జ‌న సేన పార్టీలు త‌మ అభ్య‌ర్థి అంటే.. త‌మ అభ్య‌ర్థి అంటూ.. ఇక్క‌డ అప్పుడే రాజ‌కీయాల‌కు తెర‌దీశాయి. మేం గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొని మీకు ప్ర‌చారం చేస్తున్నాం కాబ‌ట్టి.. మీరు మాకు తిరుప‌తి వ‌దిలేయాలంటూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, తిరుప‌తి అభివృద్ధి అంటూ జ‌రిగిందంటే.. అది మాక్రెడిటే.. కాబ‌ట్టి.. మేం త‌ప్ప ఇక్క‌డ ఓట్లు అడిగే అర్హ‌త ఎవ‌రికీ లేదంటూ.. బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు.

అంటే.. ప‌రోక్షంగా బీజేపీ నాయ‌కులు .. ఇక్క‌డ త‌మ అభ్య‌ర్థే ఉంటాడ‌నే సంకేతాలు పంపించారు. స‌రే! ఈ విష‌యం ఢిల్లీ దాకా వెళ్ల‌డం.. అభ్య‌ర్థి ఎవ‌రనే విష‌యంపై ఓ క‌మిటీని వేయ‌డం కూడా జ‌రుగుతోంది. ఇదిలావుంటే.. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. రాష్ట్రంలో జ‌రుగుతున్న పోలింగ్‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాదిన్న‌రలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన వారు.. ఆయ‌న పాల‌న బాగాలేద‌న్న‌వారు.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ గెలుపు ద్వారా జ‌గ‌న్‌పై పైచేయి సాధించాల‌నే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అయితే.. అభ్య‌ర్థి విష‌యంలో పోటీ ప‌డుతున్న బీజేపీ-జ‌న‌సేనల ప‌రిస్థితి ఇక్క‌డ ఎలా ఉంది? గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు ఎలాంటి రిజ‌ల్ట్ సాధించాయి? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మూడు ఎన్నిక‌ల హిస్ట‌రీని ప‌రిశీలిస్తే.. బీజేపీ స‌త్తా ఏంటో.. జ‌న‌సేన స‌త్తా ఏంటో.. రెండు పార్టీలు క‌లిసిపోరాడితే.. వ‌చ్చే రిజ‌ల్ట్ ఏంటో తెలుస్తుంది. 2009 ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది. ఆ ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ ఎన్‌. వెంక‌ట‌స్వామికి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న సాధించిన ఓట్లు.. 21,696. అంటే.. ఆయ‌న డిపాజిట్‌ను కూడా కోల్పోయారు.

ఇక‌, జ‌న‌సేన ఎంట్రీ 2014కు ముందు జ‌రిగింది. సో.. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌(మ‌ద్ద‌తు ఇచ్చిం ది) క‌లిసి పోటీ చేశాయి. టీడీపీ తిరుప‌తి టికెట్‌ను బీజేపీకి వ‌దిలేసింది. దీంతో బీజేపీ త‌ర‌ఫున కారుమంచి జ‌య‌రామ్ .. ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచారు. ఇంత మంది క‌లిసి పోటీ చేసి.. ఏకంగా తిరుప‌తిలో అప్ప‌టి ప్ర‌ధాని అభ్య‌ర్థి న‌రేంద్ర మోడీ వ‌చ్చి ప్ర‌చారం చేసినా.. ఇక్క‌డ నుంచి పోటీకి దిగిన జ‌య‌రాం.. 5,42,951 ఓట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన‌.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రికి వారుగా పోటీ చేశారు. బీజేపీ ఒంట‌రిగానే బ‌రిలో దిగింది. ఈ పార్టీ త‌ర‌ఫున బొమ్మి శ్రీహ‌రిరావు.. పోటీ చేసి కేవలం 16,125 ఓట్లు సాధించి.. డిపాజిట్ ద‌క్కించుకోలేక అభాసుపాల‌య్యారు. ఇక‌, జ‌న‌సేన ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఈ పార్టీకి ఇక్క‌డ అభ్య‌ర్థేలేడు. దీంతో టికెట్‌ను బీఎస్పీకి కేటాయించారు. బీఎస్పీ త‌ర‌ఫున‌ డాక్ట‌ర్ ద‌గ్గుమాటి శ్రీహ‌రిరావు రంగంలోకి దిగారు. ఈయన 20971 ఓట్లు సాధించినా.. డిపాజిట్ కోల్పోయారు. ఇదీ.. ఈ రెండు పార్టీల ప‌రిస్థితి. మ‌రి ఇప్పుడు ఏకంగా అభ్య‌ర్థి విష‌యంలో పోటీ ప‌డుతున్నారు. స‌రే.. ఇప్పుడు క‌లిసి పోటీ చేసినా.. ల‌క్ష ఓట్లు సాధించ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదీ సంగ‌తి!!