తెలుగుదేశం గాలి ఎంతవరకు నిజం?

తెలుగుదేశం గాలి ఎంతవరకు నిజం?

తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన  వారెవరైనా తెలుగుదేశం ఇంతో అంతో బలం పుంజుకుందనే చెబుతారు. అయితే ఇక్కడ రెండు విషయాలున్నాయి. చంద్రబాబు మంత్రాంగం, బలమైన పార్టీ యంత్రాంగం పనిచేసి,ఈ ఫలితాలు సాధించి పెట్టాయా? లేక రాష్ట్రంలో తెలుగుదేశం గాలి వీచడం ప్రారంభమైందా? మొదటి దానిపై మొదటి నుంచీ అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబుకు అద్భుతమైన మేనేజ్ మెంట్ చతురుడు. మరోపక్క పార్టీ యంత్రాంగం బలంగా వుంది. అయితే మరి అలాంటపుడు దేశం గాలి వీచడం ప్రారంభమైందన్న ఆలోచన ఎందుకు రావాలి? అక్కడే వుంది కీలకం. ఇదే పార్టీ యంత్రాంగం, ఇదే మేనేజ్ మెంట్ చతురత బాబు గడచిన తొమ్మిదేళ్లుగా ప్రదర్శిస్తూనే వున్నారు. కానీ జనం నమ్మలేదు. దరిచేర్చుకోలేదు. చాలా ఎన్నికల్లో పార్టీ నెగిటివ్ ఫలితాలనే చవిచూసింది తప్ప మరొకటి కాదు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా మారింది.అంటే ఇక్కడ కచ్చితంగా జనంలో కనిపించని వేవ్ మొదలవుతొందని అనుమానం కలగక తప్పదు.

చంద్రబాబు అధికారం చేతిలో వున్నపుడు ప్రజలను తక్కువ అంచనా వేసింది వాస్తవం. తాను పాలించుకుంటూ పోతే, పనిచేసుకుంటూ పోతే ఫలితాలు అవే వస్తాయని అనుకున్నారు. తాత్కాలిక ఫలితాల కన్నా, దీర్ఘకాలిక, భవిష్యత్ లో  ఉపయోగపడేవాటికి ప్రాధన్యత ఇవ్వడం ప్రారంభించారు.  విజన్ కలిగిన ముఖ్యమంత్రిగా అది సరియైన చర్య అనిపించుకుంటుంది కానీ, పార్టీని విజయపథంలో నడిపించాల్సిన నాయకుడిగా కాదు. అక్కడే చంద్రబాబు విఫలమయ్యారు. ఫలితాలు తారుమారయ్యాయి. అప్పటి నుంచి ఎనిమిదేళ్లు ఆయన తన నోటి మాటలతోనే ప్రజాలకు తాను అనుకుంటున్నది చెప్పాలని చూసారు. కానీ జనాలకు చేరలేదు. అలాంటి సమయంలో పాదయాత్ర చేపట్టడం అన్నది ఆయన్ను ప్రజలకు దగ్గర చేయడంలో కాస్త ప్రముఖ పాత్రే పోషించింది.

అయితే అదీ పూర్తిగా బాబుకు సహకరించలేదు. కాంగ్రెస్ వైఫల్యాలు అదే సమయంలో శిశుపాలుడి తప్పుల్లా పెరిగిపోవడం ప్రారంభించాయి. ఇది జనాలపై కచ్చితమైన ప్రభావం కనబర్చింది. అప్పుడు వారిలో పోల్చుకుని చూసుకోవడం అన్నది ప్రారంభంమైంది. అదిగో సరిగ్గా అదే ఇప్పుడు రాష్ట్రంలొ తెలుగుదేశం పార్టీకి ఆశావహ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. చాలు..ఈ మాత్రం వాతావరణం వుంటే చాలు. బాబు తన చతురత అంతా ప్రదర్శించేస్తారు. ఫలితాలు తనకు అనుకూలంగా ఎలా తిప్పుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అదంతా తరువాత సంగతి. ఇప్పుడు ఆలోచించాల్సింది, ఇప్పుడు ప్రారంభమైన దేశం అనుకూల గాలి ప్రభావం శాసనసభ ఎన్నికల వరకు ఏ మేరకు వుంటుంది.  వుంటే పెరుగుతుందా? తరుగుతుందా అన్నది చూడాలి.

సాధారణంగా వేవ్ అన్నది ఎప్పుడూ నెమ్మదిగా ప్రారంభమై, ఉధృతంగా మారుతుంది. ఇప్పుడు ఈ తొలివిడత ఎన్నికల్లో కనిపించిన వేవ్, ఐతే తరహాలో సాగే అవకాశాలే ఎక్కవు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు సమస్యలతో విసిగిపోవడం అన్నది రోజు రోజుకు పెరుగుతోంది కానీ తరగడం లేదు. సమస్యల వెనుక కారణాలు, ఈక్వేషన్లు ఏవైనా కావచ్చు. కానీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సింది అధికార పక్షమే. అందునా రెండు దఫాలు అధికారంలో వున్న తరువాత ఇది తప్పదు. ఇక ఇక్కడ దేశం భయపడాల్సింది వైకాపా పార్టీకి. మరీ అంత తీసి పారేయాల్సినంత రేంజ్ ఏమీ లేదు, ఈ ఫలితాలు చూస్తుంటే. ఎందుకంటే పార్టీ పెద్దగా కృషి చేయకుండా వచ్చిన ఫలితాలివి. అందువల్ల వీటిని బేరీజు వేసుకునే, దేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అసెంబ్లీ బరిలోకి దిగాల్సి వుంటుంది.

అందువల్ల తెలుగుదేశం ముందున్న తక్షణ కర్తవ్యం, మరింతగా జనంలోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టడం. అలాంటి కార్యక్రమాలు మాత్రమే, మరో ఆరు నెలల పాటు ఈ గాలి ఇలా వీచేలా చేయగలవు. అలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే, చంద్రబాబు మంత్రాంగం సరిపోదు. పార్టీ యంత్రాంగం యావత్తూ బలంగా పనిచేయాలి. కానీ తొమ్మిదేళ్లుగా ఉద్యమించడం అంటే దూరంగా వున్న నాయకులు కదిలి రావడం అన్నది సమస్య. అసెంబ్లీ టిక్కెట్లే వీరిని కదిలించగల ములు కర్రలు. వాటిని ఎరవేసి, వీరిని బాబు ముందుకు నడిపించగలిగితే చాలు. పార్టీని విజయతీరం వైపు జనాలే నడిపించుకుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు