అమ‌రావ‌తి ప్ర‌త్యేక జిల్లా.. వైసీపీ వ్యూహ‌మేంటి?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి.. ప్ర‌త్యేక జిల్లా కానుందా? దీనికి సంబంధించిన వైసీపీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోందా? అంటే.. ఔన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లోనే ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దీనికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో తాను తీసుకుంటున్న నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద మ‌వుతుండ‌డం, ప్ర‌జ‌ల్లో గ‌త ఏడాది ఉన్న రేంజ్‌లో జ‌గ‌న్‌పై సానుకూల లోపించిన నేప‌థ్యంలో దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు వ్యూహాత్మ‌కంగా జిల్లాల ఏర్పాటులో కీల‌క ప‌రిణామాలు తీసుకువ‌స్తున్నారు.

ప్ర‌జ‌ల డిమాండ్ల మేర‌కు జిల్లాలు ఏర్పాటు చేస్తే.. పోయేదేంటి? అనే చ‌ర్చ వైసీపీలో జోరుగాసాగుతోంది‌. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు ఇది ఫార్ములా మాదిరిగా ఉప యోగ‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాల సంఖ్య భారీగా పెర‌గ‌నుంది. వాస్త‌వానికి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార‌ద్య‌ర్శి నేతృత్వంతో క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు త‌నపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కోరుకుంటున్న జిల్లాలు కూడా ఏర్పాటుతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

దీని ప్ర‌కారం.. 32 జిల్లాల‌కు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. క‌ర్నూలులో ఆదోని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కాదు. అయిన‌ప్ప‌టికీ.. జిల్లా ఏర్పాటు చేయాల‌ని చూస్తోంది. ఇలా రాష్ట్రంలో మొత్తం 6 కొత్త జిల్లాల‌ను పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు కాన‌ప్ప‌టికీ.. ఏర్పాటు చేయాల‌ని తాజాగా నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి లీకులు వ‌చ్చాయి. వీటిలో అమ‌రావ‌తి ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇది ఏపీ రాజ‌ధాని. అయితే, మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌తో ఇక్కడ ఎగ‌సిన వ్య‌తిరేక జ్వాల‌ల‌ను చ‌ల్లార్చేందుకు వ్యూహాత్మ‌కంగా జిల్లా ఏర్పాటును తెర‌మీద‌కి తెచ్చారు. అమ‌రావ‌తి జిల్లా ఏర్పాటుతో పాటు అమ‌రావ‌తిని గ్రేట‌ర్ న‌గ‌రంగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అమ‌రావ‌తిని జిల్లాగా ఏర్పాటు చేయ‌డం ద్వారా కృష్నాజిల్లాలోని రెండు ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాల‌ను దీనిలో విలీనం చేయ‌నున్నారు. దీని ప్ర‌కారం.. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో అమ‌రావ‌తి జిల్లాను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో జిల్లా ఏర్పాటుతో రాజ‌ధాని ర‌గ‌డ ఆడుతుందా? అనేది మాత్రం ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు. ఏదేమైనా.. అమ‌రావ‌తి జిల్లా ఏర్పాటు మాత్రం ఖాయ‌మ‌నే సంకేతాలు రావ‌డం.. ప్ర‌భుత్వం ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలియ‌డంతో అమ‌రావ‌తి ప్ర‌జ‌లు ఏం చేస్తారో చూడాలి.