తెలుగోళ్లను పడేసిన కాజల్

లాక్ డౌన్ టైంలో చాలా వరకు పెళ్లిళ్లు సింపుల్‌గానే జరుగుతున్నాయి. సెలబ్రెటీలు కూడా హడావుడి, జన సందోహాన్ని నివారించి మామూలుగానే పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తున్నారు. ఐతే కరోనాను రాను రాను జనాలు తేలిగ్గా తీసుకుంటుండటం, ప్రభుత్వం కూడా మరీ కఠినంగా వ్యవహరించకపోవడంతో ఈ మధ్య పెళ్లిళ్లలో సందడి బాగానే ఉంటోంది. ఇలాంటి తరుణంలోనే బహు భాషల్లో స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది.

ఎన్నో ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఆమె మూడు ముళ్లు వేయించుకుంది. పెళ్లి జరిగిన కొన్ని నిమిషాలకే అంత క్లారిటీ లేని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. సమయం గడిచేకొద్దీ మరింత స్పష్టత ఉన్న ఫొటోలు అధికారికంగా బయటికి వచ్చాయి. చూడముచ్చటగా ఉన్న ఈ ఫొటోలు కాజల్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

ఐతే తెలుగులోనే అత్యధికంగా సినిమాలు చేసి ఇక్కడే ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న కాజల్.. ఇక్కడి జనాలతో మరీ అంత అటాచ్డ్ కాదు అన్నట్లుగా ఉండేది. కానీ పెళ్లి సందర్భంగా మాత్రం ఆమె తెలుగు వాళ్ల మనసు దోచేసింది. తెలుగు వారికే సొంతమైన జీలకర్ర-బెల్లం సంప్రదాయాన్ని కాజల్, గౌతమ్ పాటించడం విశేషం. సంబంధిత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వధూవరులు ఒకరి నెత్తిన ఒకరు చేతులు పెట్టి జీలకర్ర-బెల్లం తంతును నిర్వహిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

వధూవరుల డ్రెస్సింగ్ దగ్గర్నుంచి, మిగతా వ్యవహారమంతా ఉత్తరాది సంప్రదాయల ప్రకారమే జరిగినట్లుంది. కానీ తెలుగు ప్రేక్షకులతో ఉన్న అనుబంధం మూలంగానో ఏమో.. కాజల్ జీలకర్ర-బెల్లం సంప్రదాయం పాటించిందేమో అని భావిస్తున్నారు. ఇదే నిజమైతే మన సంప్రదాయాన్ని ఇలా గౌరవించినందుకు కాజల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.