దుమారం రేపిన ‘ఈరోస్’ పోస్టులు

బాలీవుడ్లో ప్రముఖ బేనర్లలో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వివాదంలో చిక్కుకుంది. నవరాత్రి వేడుకల్ని పురస్కరించుకుని ఆ సంస్థ ట్విట్టర్లో పెట్టిన పోస్టులు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. ఆ పోస్టుల్ని వెంటనే డెలీట్ చేసి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. నవరాత్రి ఉత్సవాల విషయమై తమ ఫాలోవర్లను ఎంగేజ్ చేసేందుకు ఈరోస్ ట్విట్టర్లో కొన్ని ఫొటోలు, క్యాప్షన్లతో కూడిన పోస్టులు పెట్టింది.

అందులో ఒకదాంట్లో కత్రినా కైఫ్ సెక్సీ ఫొటో పెట్టి.. ‘డు యు వాంట్ టు పుట్ మై రాత్రి ఇన్ నవరాత్రి’ అని క్యాప్షన్ జోడించారు. అలాగే సల్మాన్ ఖాన్ ఫొటో పెట్టి ‘యు నీడ్ ఎ దాండి టు ప్లే దాండియా. ఐ హ్యావ్ వన్’ అని.. రణ్వీర్ సింగ్ ఫొటో పెట్టి ‘లెట్స్ హ్యావ్ సమ్ మజామా ఇన్ పజామా’ అని క్యాప్షన్లతో కూడిన పోస్టులు పెట్టారు.

హిందూ పండగ అయిన దసరా మీద కౌంటర్లు వేస్తూ ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. రంజాన్ పండుగ టైంలో మాత్రం పద్ధతిగా శుభాకాంక్షలు చెప్పి.. హిందూ పండుగ విషయంలో మాత్రం ఈ పరాచికాలు ఏంటని వాళ్లు మండిపడ్డారు. బాయ్ కాట్ ఈరోస్ అంటూ నిన్నట్నుంచి ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమం బాగా ఊపందుకుని నేషనల్ వైడ్ ఈరోస్ వ్యతిరేక హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.

ఈ మధ్య హిందుత్వ అజెండాతో దూకుడుగా వ్యవహరిస్తున్న కంగనా రనౌత్ సైతం లైన్లోకి వచ్చింది. ఈరోస్ తీరును దుయ్యబట్టింది. వివాదం పెద్దదవుతుండటంతో ఈరోస్ స్పందించింది. ఆ ట్వీట్లన్నింటినీ డెలీట్ చేసింది. తమ పోస్టులు ఎవరి మనోభావాలైనా దెబ్బ తీసి ఉంటే మన్నించాలని పేర్కొంది. అయినప్పటికీ ఆ సంస్థ మీద ట్రోలింగ్ కొనసాగుతోంది. దీంతో పాటు హిందూ, ముస్లిం పండుగల విషయంలో బాలీవుడ్ తారలు ద్వంద్వ ప్రమాణాలతో స్పందించే తీరును కూడా నెటిజన్లు దుయ్యబడుతున్నారు.