వైరల్ వీడియో.. కోవిడ్ పేషెంట్ల ముందు డాక్టర్ డ్యాన్స్

https://www.youtube.com/watch?v=4JBIrfeAMNk

స్కూల్లో కాలేజీల్లో చదువుకునేటపుడు ఎన్నో టాలెంట్లు ప్రదర్శించి సరదాగా జీవితాన్ని గడిపేసే వ్యక్తులు.. ఆ తర్వాత సీరియస్‌గా సాగే వృత్తుల్లో పడి తమ ప్రతిభను మరుగున పడేస్తుంటారు. వాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎప్పుడో కానీ రాదు. అలా వచ్చినపుడు వాళ్ల ప్రతిభ చూసిన కొత్త వ్యక్తులు ఆశ్చర్యపోతుంటారు. వీళ్లలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తారు. తాజాగా ఒక వైద్యుడు అలాగే తన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి అక్కడి ఒక కోవిడ్ ఆసుపత్రిలో పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాడు. ఐతే ఆ పేషెంట్లకు బోర్ కొడుతుండటంతో వారిని వినోదపరిచేందుకు అరూప్ స్వయంగా డ్యాన్స్ వేయడానికి సిద్ధమయ్యాడు. పీపీఈ కిట్ ధరించి, ముఖానికి మాస్క్, ఫేస్ షీల్డ్ వేసుకోవడంతో ఆయన రూపం బయటికి కనిపించలేదు. ఐతే ఆయన స్టెప్పులు మాత్రం వారెవా అనిపించాయి. హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ సినిమాలోని తు లమ్హే కరాబ్ కరే పాటకు చాలా స్టైలిష్‌గా, సింపుల్‌గా వేసిన స్టెప్పులు అరూప్ ఎంత మంచి డ్యాన్సరో తెలియజేశాయి.

ఇంకో డ్యాన్సర్ ఎవరైనా ఫ్లోర్ మీద ఈ డ్యాన్సులు వేస్తే అందులో విశేషం ఏమీ లేదు. కానీ పీపీఈ కిట్ ధరించి కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్.. ఆసుపత్రిలో ఆ పేషెంట్ల ముందే ఇలా నృత్య ప్రతిభను ప్రదర్శించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. స్వయంగా హృతిక్ రోషన్ సైతం ఈ వీడియోపై స్పందించాడు. తాను అరూప్ స్టెప్పులు చూసి నేర్చుకుంటానని.. ఏదో ఒక రోజు అస్సాంకు వచ్చి అతడి ముందు ఆ స్టెప్పులు వేయడానికి ప్రయత్నిస్తానని హృతిక్ ట్వీట్ చేయడం విశేషం. హృతిక్ స్పందించడంతో ఈ వీడియో మరింతగా పాపులర్ అవుతోంది.