ఏపిలో రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు.

తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపి ఆరోపించారు. ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్ధితులను చక్కదిద్దాలంటే ఆర్టికల్ 356 పెట్టే పరిస్దితులు దాపురిస్తున్నట్లు మండిపడ్డారు. సరే ఎంపి వ్యాఖ్యలు, ఆరోపణలను పక్కనపెట్టేస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అంటే తిరుగుబాటు ఎంపి మండిపోతున్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ లోక్ సభ స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినప్పటి నుండి ఎంపిలో సిఎంని విమర్శించే ఏ అంశం దొరికినా వదలడం లేదు.

ప్రతిరోజు ఏదో ఒక ప్రజా సమస్యతో తెరపైకి వచ్చి జగన్ ని నిలదీస్తున్నారు. లోక్ సభ స్పీకర్ గనుక తనపై అనర్హత వేటు వేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవనే ఎంపి జగన్ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఎదురుదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగమే ఏపిలో రాష్ట్రపతి పాలనంటూ కొత్త పల్లవి అందుకున్నారంటూ వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.