టాలీవుడ్లో 20 శాతం పారితోష‌కాల‌ కోత‌?

క‌రోనాతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ ఒక‌టి. ఆరు నెల‌ల‌కు పైగా షూటింగుల్లేవు. థియేట‌ర్ల‌లో కొత్త చిత్రాల విడుద‌ల లేదు. ఓటీటీల్లో ఏవో కొన్ని సినిమాలు రిలీజ‌య్యాయి కానీ.. వాటి వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన లాభం త‌క్కువే. మామూలుగానే సినిమాల్లో స‌క్సెస్ రేట్ త‌క్కువ‌. నిర్మాత‌ల ప‌రిస్థితి ఏమంత బాగుండ‌దు. క‌రోనా ధాటికి వారి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది.

ఈ ప్ర‌భావం ఇక ముందు తెర‌కెక్క‌బోయే చిత్రాల మీద క‌చ్చితంగా ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్లు త‌గ్గించాలి. పారితోష‌కాలు త‌గ్గాలి. అది అనివార్యం. ఈ విష‌యంలో యాక్టివ్ తెలుగు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఒక ముఖ్య స‌మావేశం నిర్వ‌హించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌ పై తెర‌కెక్క‌బోయే చిత్రాల్లో ప‌ని చేసే ఆర్టిస్టులు పారితోష‌కాలు త‌గ్గించుకోవాల్సిందే. రోజుకు 20 వేల‌కు మించి పారితోష‌కం అందుకునే ప్ర‌తి ఆర్టిస్టూ 20 శాతం పారితోష‌కం త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అంత‌కంటే లోపు రెమ్యూన‌రేష‌న్ తీసుకునేవాళ్ల‌కు ఈ ష‌ర‌తు వ‌ర్తించ‌దు. అలాగే సినిమాకు 5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ పారితోష‌కం తీసుకునే టెక్నీషియ‌న్ల‌కు కూడా 20 శాతం త‌గ్గింపు వ‌ర్తిస్తుంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌తో సంప్ర‌దించాకే, వారి అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. క‌రోనా నేప‌థ్యంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన సినీ ప‌రిశ్ర‌మ ముందుకు సాగాలంటే పారితోష‌కాలు త‌గ్గించుకోక త‌ప్ప‌ద‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ పేర్కొంది. ఐతే ఈ పారితోష‌కాల త‌గ్గింపు ఎప్ప‌టిదాకా అన్న‌ది వెల్ల‌డించ‌లేదు.